గబ్బర్ సింగ్.. ఈ పేరు చెబితే పవన్ కల్యాణ్ అభిమానులు పులకించి పోతారు. పవన్ కెరీర్‌లో అతి పెద్ద హిట్స్‌లో అదొకటి. పైగా… వరుస పరాజయాలకు బ్రేక్ కొడుతూ పవన్ స్టామినాని చూపించిన సినిమా. ఆసినిమాతోనే హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దానికి సంబంధించిన పనులూ మొదలైపోయాయి. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవి ఓ ట్యూను సిద్ధం చేశాడని, అది పవన్ కీ, హరీష్‌కి నచ్చేశాయని తెలుస్తోంది.
ఇదో పోలీస్ కథ అని, గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అనీ, పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అవేం నిజాలు కావని తేలిపోయింది. గబ్బర్ సింగ్ కీ ఈ సినిమాకీ అస్సలు సంబంధమే లేదు. ద్విపాత్రాభినయం కూడా కాదు. పవన్ సోలో హీరోనే. ఇది వరకెప్పుడూ చేయని పాత్రలో పవన్ కనిపిస్తాడని హరీష్ చెబుతున్నారు. 2021లోనే ఈప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.