తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్యులు ఎమ్మారై, సీటీ స్కాన్ రిఫర్ చేశారు. ఊపిరి తిత్తుల్లో మంట పుడుతున్న ఫీలింగ్ కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత వారు.. ఎమ్మారై, సీటీ స్కాన్ చేయాలని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ పెద్దగా.. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దాదాపుగా రెండు వారాల పాటు ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని ఆయన ప్రగతి భవన్‌కు వచ్చారు. కొన్ని సమీక్షలు చేశారు.
కొద్ది రోజుల కిందట.. కేంద్రమంత్రి గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో.. ఆయన కూడా.. ఆన్ లైన్ ద్వారా పాల్గొనాల్సి వచ్చింది. కానీ అనారోగ్యం వల్ల ఆయన పాల్గొనలేదు. ఈ విషయం తెలిసి గడ్కరీ కూడా… ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం.. ఆయన కార్యక్రమంలో పాల్గొనకుండా.. ఓ సాకు మాత్రమేనని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు… ఆయన నిజంగానే తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో… అనారోగ్యం నిజమేనని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు.. ముందు నుంచీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
కేటీఆర్‌ను సీఎం చేస్తారని ప్రచారం వెనుక ఆయన ఆరోగ్యం కూడా ఒక కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. గతంలోనూ పలుమార్లు కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో రోటీన్ చెకప్ చేయించుకున్నారు. అన్నీ బాగున్నాయని వైద్యులు ప్రకటించారు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో … అన్ని రకాల టెస్టులు చేసి… పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు… కీలకమైన టెస్టులకు సిఫార్సు చేసినట్లుగా భావిస్తున్నారు.