ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో… ఘాట్ల నిర్మాణానికి, అతర అభివృద్ధి పనులకు అడ్డంగా ఉన్నాయని తొలగించిన తొమ్మిది ఆలయాలను మళ్లీ అక్కడే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే శంకుస్థాపన ముహుర్తం కూడా ఖరారు చేశారు. శుక్రవారమే… ముఖ్యమంత్రి జగన్ వాటికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్దికి రూ. 70 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేశారు. వాటితో చేపట్టబోయే పనులను కూడా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మతపరమైన రాజకీయ ఉద్రిక్తతల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. వెంటనేఅమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా.. తాము ఇంకా ఎక్కువగా హిందూ మతాన్ని గౌరవిస్తున్నామని… ప్రభుత్వం నిరూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు… ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రోడ్డు మీద నిర్మించిన పలు ఆలయాలను కూడా గత ప్రభుత్వం తొలగించింది. వాటిని కూడా.. నిర్మించాలనే డిమాండ్లు ప్రజల వద్ద నుంచి వస్తున్నాయి. అయితే. . అక్కడే నిర్మించడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి… ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.
ఆలయాలపై దాడులు.. ఇతర అంశాల్లో తమ ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు.. అధికారులు… ప్రభుత్వ పెద్దలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది డీజీపీ సవాంగ్ తొలి సారి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చారో లేదో క్లారిటీ లేదు. కానీ ఆయనకు అధికారిక మర్యాదలతో స్వామివారి దర్శనం లభించింది. ఇప్పుడు సీఎం జగన్ గుళ్లకు శంకుస్థాపన చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ అధికార కేంద్రంలోనూ… క్రిస్టియన్స్ ఉన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. దిద్దుబాటు చర్యలను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.