ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కీలక అధికారుల్లో ఒకరైన ధనుంజయ్ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఉద్యోగుల ఇన్సూరెన్స్… ఇతర సదుపాయాలేమీ వర్కవుట్ కాలేదో.. లేకపోతే.. అత్యవసరంగా నగదు చెల్లించి ట్రీట్మెంట్ పొందారో కానీ.. కాను ఖర్చుపోయాయంటూ..ప్రభుత్వానికి బిల్లులు పెట్టారు. ప్రభుత్వం వెంటనే ఆయనకు నిధులు మంజూరు చేసింది. మొత్తంగా పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ధనుంజయ్ రెడ్డికి ప్రజల పన్నులుగా చెల్లించిన మొత్తం రూ. 3,77,520 చెల్లించింది.
కార్పొరేట్ ఆస్పత్రిలో పది రోజుల పాటు ఐసోలేషన్ అవడానికి అ మాత్రం ఖర్చవుతుంది. అయితే.. ఇక్కడ సమస్య.. ప్రజాధనం ఎందుకు చెల్లించాలన్నదే. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వం.. రోజుకు రూ. యాభై కోట్ల వరకూ ఖర్చు పెట్టి.. కరోనా చికిత్సలు చేస్తోంది. అయినప్పటికీ.. బాధ్యత గల ప్రభుత్వ అధికారులు హైదరాబాద్కు వెళ్లి చికిత్స తీసుకుని .. లక్షలకు లక్షలు ఎందుకు బిల్లులు పెట్టి వసూలు చేసుకుంటున్నారన్నదే ప్రశ్న. జవహర్ రెడ్డికి ప్రత్యేకంగా జీవో జారీ చేశారుకాబట్టి తెలిసింది.. కానీ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు కూడా.. కరోనా బారిన పడ్డారు. వారు కూడా హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందారు. వారి చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
ఏపీ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో కూడా చేర్చింది. ప్రజలకు ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్న సమయంలో… అధికారులు మాత్రం లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకోవడం.. మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం… వివిధ రకాలుగా పన్నుల భారాన్ని మోపుతోంది. ఇలాంటి ఖర్చులు తగ్గించుకుని.. ఏపీలోనే.. అన్నిరకాల సౌకర్యాలను… ప్రభుత్వ పెద్దలు,అధికారులు పొందితే… చాలా వరకూ నిధులు ఆదా అవుతాయనే సలహాలను ఇతరులు ఇస్తున్నారు.