రాజకీయ పదవులను పంచుకోవడాననికైతే.. వారికి ఎంతైనా ఓపిక వస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాలను తోసిరాజని…. ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టి మరీ కేంద్రానికి చాలా చొరవ వస్తుంది. అందుకోసం నాయకమ్మన్యులు అంతా ఎగబడి ఆ మేరకు చట్టసవరణలు జరగడానికి, కొత్త పదవులను సృష్టించడానికి తహతహలాడుతారు. మరి కొత్తగా ఏర్పడిన అనాధ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కించే విషయంలో ఇంత శ్రద్ధ ఏమైపోతుంది. ఈ ఆసక్తి తెలుగుదనం ఈ అస్తిత్వవాదం ఇవన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు వింటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే స్థానాలను అమాంతం పెంచేయడం గురించి ఉన్న శ్రద్ధలో కనీసం వందో వంతు అయినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించే విషయంలో ఉండి ఉంటే.. ఈ పాటికి ఎన్నడో అది వచ్చేసి ఉండేదని అనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినందున విభజన చట్టం కల్పించే వెసులుబాటు ప్రకారం.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225 కు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో శ్రద్ధగానే సీట్లు పెంచేయడం గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్రంతో తమ వంతు చర్చలు సాగిస్తున్నారు.
అయితే ఈ విషయంలో తాను కూడా చాలా శ్రద్ధ వహించి తక్షణం సీట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ విషయంలో న్యాయశాఖమంత్రి సదానందగౌడతోను, ఆ శాఖ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిజానికి 2026 వరకు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి నిషేధం ఉంది. ఇటీవల వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఈ విషయంలో సీఈసీ ని కలిసి విన్నవనించినప్పుడు, 2026 వరకు కుదరదు అంటూ ఆయన తెగేసి చెప్పడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అయితే పార్లమెంటులో ఒక చట్టం ద్వారా కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు సీట్లు పెంచడం కుదురుతుందని వెంకయ్య సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఎమ్మెల్యే సీట్లు పెంచి.. పదవులను దండుకోవడానికి మాత్రం నాయకుల్లో ఇంత శ్రద్ద వ్యక్తమవుతున్నదే.. మరి ప్రత్యేకహోదా విషయంలో కూడా వెంకయ్య ఈ పాటి ఆసక్తిని, శ్రద్ధనుచూపించలేదు ఎందుకు? అన్ని రాష్ట్రాలూ అడుగుతాయి, అన్ని రాష్ట్రాలూ అంగీకరించాలి.. లాంటి అడ్డగోలు కబుర్లు చెబుతూ.. హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను వంచించడంలో వెంకయ్య పాత్ర లేకుండా పోయిందా? పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీని కార్యరూపంలో పెట్టడానికి దిక్కులేకపోగా, రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ప్రయోజనం కలిగే నిర్ణయాన్ని గాలికొదిలేసి.. నాయకులకు పదవులు పంచడానికి తప్ప ఎందుకూ కొరగాని అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అనేదానిమీద అందరూ ఇంతగా ఆరాటపడుతూ ఎందకు శ్రద్ధ చూపిస్తున్నారనేది అందరికీ తెలిసిన సంగతే.
నాయకులు తమ స్వార్థానికి వాటికే అగ్రప్రాధాన్యం ఇస్తే ఇవ్వొచ్చు గాక.. కానీ కనీసం రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా ఢిల్లీలో కొంత ప్రయత్నిస్తూ ఉంటే జనం దృష్టిలో వారికి ఆదరణ, గౌరవం దక్కుతుంది.