ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వానికి చాన్సివ్వకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు చెప్పిన మేరకు సంప్రదింపులు పూర్తయిన వెంటనే.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల ఇరవై మూడో తేదీన మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు.. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేశారు. 27వ తేదీన రెండో దశ, 31వ తేదీన మూడో దశ, నాలుగో తేదీన నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎస్ఈసీ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది.
గత ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. కరోనా కారణంగా నిలిచిపోయింది. మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు.. నామినేషన్ల వరకూ వచ్చినా.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. దాంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా పోయాయి. ఈ కారణంగా… ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ నిర్ణయించి .. ఆ మేరకు ప్రోసీడింగ్స్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం.. కరోనా కారణం చెబుతూ.., నిర్వహించనే నిర్వహించబోమని చెబుతూ వచ్చింది. అయితే ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీదే అంతిమ నిర్ణయం. ప్రభుత్వం సహకరించకపోవడానికి చాన్సే లేదు. అలా సహకరించకపోతే.. ,రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది.
అంతకు ముందు… సీఎస్ నేతృత్వంలో ఎస్ఈసీ వద్దకు వచ్చిన కమిటీ.. చెప్పాల్సిందంతా చెప్పి ఓ లేఖ ఇచ్చి వెళ్లారు. ఆ లేఖలో.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు. ఎందుకు సాధ్యం కాదో.. కొన్ని కారణాలు వివరించారు. వారు లేఖ ఇచ్చి వెళ్లిన తర్వాత.. నిమ్మగడ్డ నేరుగా.. రిప్లయ్ లేఖ రాశారు. అందులో.. ప్రభుత్వ అధికారుల కమిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చెప్పిన అభ్యంతరాలన్నీ గతంలో చెప్పినవేనని కాబట్టి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తూంటే… తాను ఎస్ఈసీగా ఉండగా.. ఎన్నికల నిర్వహించడానికి సిద్ధంగా లేనట్లు ఉందని.. తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలనుకుంటోందని.. నిమ్మగడ్డ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సాక్ష్యంగా… విజయసాయిరెడ్డి .. విజయనగరంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానికలు ఎన్నికలు జరుగుతాయని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే.. తన లేఖలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన తీసుకు రాకుండా.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక నేతగా ఆయన పేర్కొన్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలన్నీ… ఆ దిశగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్న విధంగా.. ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కమిషన్ పేర్కొన్న విధంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశామని.. ఈ రోజు భేటీలో కూడా అదే చెప్పామని లేఖలో నిమ్మగడ్డ గుర్తు చేశారు. ప్రభుత్వం కమిషన్ చేసిన సూచనను ఉపయోగించుకుంటుందని భావిస్తున్నామని ముగింపు ఇచ్చారు. వెంటనే… సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. స్పందించి… ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు అంగీకరించబోమని లేఖ రాసినప్పటికీ.. నిమ్మగడ్డ పట్టించుకోలేదు. షెడ్యూల్ విడుదల చేసేశారు. ఇక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.