పెద్ద సినిమా వస్తుందంటే ఎన్ని టెన్షన్లో. అందులో… లాస్ట్ మినిట్ పంచాయితీలు అగ్ర స్థానంలో ఉంటాయి. సదరు నిర్మాతకు పాత బాకీలు వెంటాడతాయి. వాటిని క్లియర్ చేసుకునేసరికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. సరిగ్గా విడుదలకు ముందు రోజే.. ఆ టెన్షన్ మొదలవుతుంది. `క్రాక్` విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాకి `ఠాగూర్` మధు నిర్మాత. ఆయనకు గతంలో కొన్ని అప్పులున్నాయి. అవన్నీ `క్రాక్` రిలీజ్ కి ముందు చుట్టు ముట్టాయి. శుక్రవారం రాత్రంతా.. ఈ పంచాయితీలు సాగాయి. తెల్లవారు ఝామున.. ఓ కొలిక్కి వచ్చి రిలీజ్ టెన్షన్ తప్పింది. ఇప్పుడు `క్రాక్` రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులూ లేవు. అయితే… మార్నింగ్ షోలు మాత్రం రద్దయ్యాయి. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో 9 గంటలకు ఓ షో ఉంటుంది. హైదరాబాద్ లో అయితే 8.54కే షో. ఆ షోకి అడ్వాన్సు బుకింగులు కూడా అయిపోయాయి. తీరా.. థియేటర్‌కి వెళ్తే… `షో రద్దు చేశాం..` అనే కబురు చల్లగా చెప్పారు. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు 11 గంటలకే షో పడబోతోంది. చాలా రోజుల తరవాత.. థియేటర్‌కి పెద్ద సినిమా వచ్చింది చూద్దాం.. అనుకున్న వాళ్లకు, రవితేజ అభిమానులకూ… ఉత్సాహం నీరుగారిపోయింది.