ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం అదే పనిగా చెబుతున్నప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో న్యాయపోరాటం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తే.. హైకోర్టును ఆశ్రయించాలన్న సూచనలు వస్తాయని న్యాయనిపుణులు ప్రభుత్వ వర్గాలకు చెప్పడంతో.. వ్యూహం మార్చుకుంది. హైకోర్టునే ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. రాత్రి నుంచి ప్రభుత్వానికి చెందిన న్యాయనిపుణులు.. అడ్వకేట్ జనరల్ కార్యాలయం… కసరత్తు జరిపి చివరికి హౌస్ మోషన్ పిటిషన్ ను రూపొందించారు. అనేక పత్రాలు జత చేశారు. అయితే.. ఈ కసరత్తు అంతా పూర్తయ్యే సరికి మధ్యాహ్నం అయింది.
కోర్టు సమయం ముగిసే ముందుగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు ఇప్పటికే సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. అత్యవసర పిటిషన్లు విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ కారణంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆలస్యం కావడంతో.. విచారణకు రాలేదు. హౌస్ మోషన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని తెలిపింది. తన పిటిషన్లో ప్రభుత్వం ప్రధానంగా కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రతను కారణంగా చెప్పింది.
ఈ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తే.. ప్రభుత్వానికి రిలీఫ్ దొరికినట్లవుతుంది. లేకపోతే.. ఎన్నికల నిర్వహణ అయిష్టంగానైనా ప్రారంభించక తప్పదు. కోర్టుల్లో వేసిన పిటిషన్లకు మ్దదతుగా ఇప్పటికే.. ఉద్యోగ సంఘాల నేతలందరితోనూ ప్రెస్మీట్లు పెట్టించారు. విజ్ఞప్తులు చేయించారు. హెచ్చరికలు కూడా చేయించారు. స్థానిక ఎన్నికలపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.