మైహోం గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు.. మీడియా రంగంలోనూ ప్రముఖమైనదే. టీవీ9, టెన్ టీవీల్లో ఈ గ్రూప్‌కు మెజార్టీ వాటా ఉంది. ఆయా చానళ్లలోఏ ఏ వార్తలు రావాలి.. అనేది డిసైడ్ చేసేది ఆ గ్రూపే. అలాంటి గ్రూప్ ఇప్పుడు రాజ్ న్యూస్ అనే చానల్లో తమపై వార్తలు వస్తున్నాయని.. తక్షణం వాటిని నిలిపివేయాలని కోరుతూ కోర్టుకెళ్లింది. ఆదేశాలు తెచ్చుకుంది. ఊపిరి పీల్చుకుంది.కోర్టు ఆదేశాల కారణంగా… మైహోంపై తాము వేయాలనుకున్న వార్తల్ని వేయడం లేదని.. రాజ్ న్యూస్ కూడా చెప్పింది.
మైహోం సంస్థ తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతోందని ఇటీవలి కాలంలో రాజ్ న్యూస్ అనేక కథనాలను ప్రసారం చేస్తోంది. అక్రమ మైనింగ్‌పై ఆ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. ఈ అంశంపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై రాజ్ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసింది. అయితే ఇవన్నీ అవాస్తవాలని రాజ్ న్యూస్ పై మైహోం గ్రూప్ పరువు నష్టం కేసులు దాఖలు చేసింది. అయితే రాజ్ న్యూస్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా… హైదరాబాద్ శివార్లలో తెల్లాపూర్‌లో జరిగిన ఓ భూదందా గురించి ప్రోమోలు వేసింది. కనీసం రూ. పదివేల కోట్లకుపైగా విలువైన భూములు.. మైహోం గ్రూప్‌తో పాటు సీఎం కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆ దందాను బయట పెడతామని.. ప్రోమోలు వేసింది. ఉలిక్కిపడిన మైహోమ్ గ్రూప్.. ఆ కథనాలు ప్రసారం కాక ముందే కోర్టుకెళ్లి ప్రసారాలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకుంది.
ప్రస్తుతం రాజ్ న్యూస్ వ్యవహారాలను… టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు. రవిప్రకాష్ కు.. మైహోం రామేశ్వరరావుకు మధ్య జరుగుతున్న వార్ గురంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రవిప్రకాష్ ను టీవీ9 నుంచి వెళ్లగొట్టడమే కాదు..అధికారాన్ని ఉపయోగించుకుని అనేకానేక పెట్టీ కేసులు పెట్టించి జైలుకు పంపడంలోనూ రామేశ్వరరావు తనదైన దూకుడు చూపించారనిచెబుతూంటారు. అయితే ఇప్పుడు రవిప్రకాష్ వంతు వచ్చిందని… రామేశ్వరరావు గుట్టుముట్లన్నీ తెలిసిన వ్యక్తిగా.. ఆయన దూకుడు చూపిస్తున్నారని అంటున్నారు. రాజ్ న్యూస్ అనే తాడూ బొంగరం లేని చానల్‌తోనే చెమటలు పట్టిస్తున్నారని.. సరైన ఫ్లాట్ ఫామ్ దొరికితే.. వదిలి పెట్టే చాన్స్ ఉండదని కూడా అంటున్నారు. కథనాలకే భయపడుతున్న మైహోం… ముందు ముందు మరిన్ని చిక్కులు ఎదుర్కోక తప్పదన్న హెచ్చిరికలను రాజ్‌న్యూస్ వైపు నుంచి అందుకుంటోంది.