శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి. ఆయనది క్లాస్ టచ్. ఎలాంటి కథైనా.. క్లాస్‌గా చెబుతుంటాడు. లవ్ స్టోరీలో ఉండే రొమాన్స్‌కి సైతం క్లాసికల్ టచ్ ఇస్తుంటాడు. `ఫిదా` అలాంటి సినిమానే. ఇప్పుడు `లవ్ స్టోరీ` అంటూ మరో ప్రేమకథ చెప్పబోతున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది. వేసవికి విడుదల అవుతోంది. ఇప్పుడు టీజర్ విడిచి పెట్టారు.
రేవంత్, మౌనికల ప్రేమకథ ఇది. ఇద్దరూ వేర్వేరు ఉద్దేశాలతో.. పట్నం వస్తారు. ఇక్కడ వాళ్లెలా కలిశారు? కలిసి ఏం చేశారు? అనేదే కథ. హీరో, హీరోయిన్లిద్దరికి తెలంగాణ నేపథ్యం ఇవ్వడం, వాళ్లిద్దరూ తెలంగాణ యాసలోనే డైలాగులు చెప్పడం, శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉండే సున్నితమైన ఎమోషన్స్, సహజమైన.. సంభాషణలు `లవ్ స్టోరీ`లోనూ కనిపిస్తున్నాయి. `
`మౌనీ.. ఏం చేస్తవ్ ఆ సాఫ్ట్ వేర్ జాబ్ లో.. కళ్లద్దాలొస్తయి.. బ్యాక్ పెయినొస్తది..`
ఏంద్రా ఒదిలేస్తవ నన్నూ..`
– ఇలా మరోసారి.. శేఖర్ కమ్ముల టచ్‌లో సాగే సంభాషణలు, కలర్‌ఫుల్ స్క్రీనూ, తెలంగాణ వీధులూ, భాగ్యనగర జీవితాలూ…. ఈ చిన్న టీజర్‌లో కుమ్మరించాడు శేఖర్ కమ్ముల. ఎప్పట్లానే టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. శేఖర్ మ్యాజిక్ మరోసారి వెండి తెరపై కనిపించబోతోందన్న భరోసా కలిగింది.