తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో నెలకొన్న భిన్నమైన పరిస్థితిని ఉపయోగించుకుని డిఫరెంట్ మైండ్ గేమ్‌ను బండి సంజయ్ జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సారి ఆయన అధికార మార్పిడిపై జరుగుతున్న ప్రచారాన్ని దీనికి ఉపయోగించుకున్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం అంతా.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికేనని బండి సంజయ్ అనుమానిస్తున్నారు. అందుకే.. కేటీఆర్‌ను సీఎం చేయడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అంతే కాదు… అధికార మార్పిడి ఖాయమన్నట్లుగా మాట్లాడారు. అంటే… కేసీఆర్ నుంచి బ్యాటన్ కేటీఆర్ అందుకుంటారని అంటున్నారు. ఇలా చేయడంతోనే ఆ పార్టీలో సంక్షోభం వస్తుందని కూడా తేల్చేశారు. ఇప్పటికే.., కేటీఆర్ కేబినెట్లో పదవుల కోసం పార్టీలో కొట్లాట జరుగుతోందని.. కేటీఆర్ కేబినెట్లోకి తీసుకోకుంటే కొత్త పార్టీ పెట్టే యోచనలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బండి సంజయ్ ప్రకటించి కలకలం రేపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీలు పెట్టే సామర్థ్యం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరున్నారబ్బా అన్న చర్చ జరుగుతోంది.
ఇది బీజేపీ మైండ్ గేమ్ మాత్రమేనని.. అసలు కేటీఆర్ సీఎం అన్న చర్చే … పార్టీలో జరగడం లేదని.. టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదన్న భావన కల్పించడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని.. ఏదైనా జరగొచ్చన్న చర్చ మాత్రం.. రాజకీయవర్గాల్లో ఉంది.