వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద చిక్కొచ్చి పడింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం గెలిచేస్తామని చెబుతున్నారు కానీ.. ఇప్పుడు ఎన్నికలు వద్దని ప్రకటనలు చేయాల్సి వస్తోంది. అంత గెలిచే ధీమా ఉన్నప్పుడు.. ఎందుకు ఎన్నికలు వద్దంటున్నారన్న దానికి వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. కరోనా ఉద్ధృతంగా ఉందని.. ప్రజల కోసం ఇప్పుడు వద్దంటున్నామని చెబుతున్నారు. కానీ నిజం మాత్రం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్నంత వరకూ జరపబోమని.. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే.. కొత్త అధికారిని నియమించి.. కరోనా గిరోనాను పట్టించుకోకుండా.. ఎన్నికలు నిర్వహిస్తారని.. ఇప్పటికే ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది.
ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ ఉంటే వైసీపీ ఎందుకు గెలవలేదన్న చర్చ సామాన్యుల్లో ప్రారంభమవుతుంది. గతంలోలా.. ఏకగ్రీవాలు చేసుకోవడం సాధ్యం కాదేమోనన్న భయంతోనే.. వైసీపీ వర్గాలు… నిమ్మగడ్డను వ్యతిరేకిస్తున్నాయంటున్నారు. చెప్పిన మాట వినే అధికారి ఉంటే.. ఫలితాలను ఎలాగైనా మార్చుకోవచ్చన్న ఉద్దేశంతోనే నిమ్మగడ్డను వద్దనుకుంటున్నారన్న చర్చ సామాన్యుల్లో ప్రారంభమవుతుంది. ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల విషయంలో… ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. మంత్రులు చేస్తున్న ప్రకటనలపై.. క్యాడర్ స్పందించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
టీడీపీ నేతలు దీన్ని మరింతగా పెంచుతున్నారు. ఎన్నికలకు భయపడే… వద్దని ఏపీ ప్రభుత్వం అంటోందని.. వైసీపీ నేతలు భయపడుతున్నారని.. ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో.. వారి తీరుతోనే తెలుస్తోందని అంటున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు తంటాలు పడుతున్నా రు.