ఆంధ్రప్రదేశ్లో స్కూలు, కాలేజీకి వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లికి రూ. పదిహేను వేలు జమ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం రెండో విడత డబ్బులను మీటనొక్కి నెల్లూరులో ప్రారంభిస్తారు. గత ఏడాది 75 శాతం హాజరు నిబంధనల పెట్టారు. ఈ సారి కరోనా కారణంగా నిబంధనలకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు మాత్రమే ఉండేది. ఈ సారి దాన్ని పదివేలు చేశారు. మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. గత ఏడాది చాలా మంది అర్హులకు ఇవ్వలేదన్న విమర్శలు రావడంతో లబ్దిదారుల్ని పెంచారు. ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఒక్క సారి మీట నొక్కడం ద్వారా సీఎం జగన్ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు జమ అవుతాయి.
నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకు నవంబర్ 23 నుంచి.. 7, 8 తరగతులకు డిసెంబర్ 14 నుంచి తరగతులు మొదలయ్యాయి. జనవరి 18 నుంచి ఆరో తరగతి విద్యార్థులకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్థితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా గతేడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు.
విద్యారంగంపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ భారీగా ఖర్చు పెడుతోంది. రెండేళ్లకు కలిపి అమ్మఒడికి రూ,13,023 కోట్లు, విద్యా దీవెనకు రూ.4,101 కోట్లు, వసతి దీవెనకు రూ.1,220.99 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది.ఇక విద్యా కానుక,గోరు ముద్దు, నాడు-నేడు వంటి వాటికి ఇంకా భారీగా ఖర్చు పెడుతోంది. 12 నెలల కాలంలో మొత్తంగా 1,87,95,804 మంది లబ్ధిదారులకు రూ.24,560 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యారంగంలో పెట్టుబడిని.. నగదు బదిలీని ప్రభుత్వం సంక్షేమంగా మాత్రమే చూడకుండా.. మానవ వనరులపై పెట్టుబడిగా చూస్తోంది.