మిత్రపక్షాలను నిర్వీర్యం చేయడంలో భారతీయ జనతా పార్టీ స్టైలే వేరు. ఆ విషయం ఒక్కసారి తలెత్తి… కశ్మీర్ నుంచి… కన్యాకుమారి వరకు పరికించి చూస్తే తెలిసిపోతుంది. ఆ పార్టీతో మిత్రుత్వం పెట్టుకున్న పార్టీ బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్న పార్టీలే బాగుపడ్డాయి. ఇప్పుడు.. పవన్ కల్యాణ్ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నారు. అంతకు ముందు చురుగ్గా ఉండే పవన్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక సైలెంట్ అయ్యారు. ఏదైనా చేస్తే కలిసే చేయాలనుకోవడమే దీనికికారణం. అయితే బీజేపీ పవన్ ను కట్టడి చేసి.. తమ కార్యక్రమాలు తాము చేసుకుంటోంది.ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేనను నియంత్రిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలకు ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా అనిపించినట్లుగా తెలుస్తోంది. రూటు మార్చి మారీ.. ప్రస్తుతం రాజకీయంగా పవన్ దూకుడు చూపిస్తూండటమే దీనికి సాక్ష్యంగా చూడొచ్చు.
పవన్ కల్యాణ్… ఇటీవల బీజేపీని పట్టించుకోకుండా సొంత కార్యాచరణ ఎక్కువగా అమలు చేస్తున్నారు. ఏలూరు వింతవ్యాధి ఘటన నుంచి వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ పోరాటాలు, దీక్షలు చేశారు. ఎక్కడా బీజేపీని ఇన్వాల్వ్ చేయలేదు. దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ఇచ్చిన అంశంలోనూ బీజేపీని కలుపుకుని పోలేదు. ఎందుకంటే తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిని నిలబెట్టాలని పవన్ అనుకున్నారు. అయితే జనసేన బలపర్చిన బీజేపీ నాయకుడిని గెలిపించండి అంటూ ఆ పార్టీ నేతలు ఏకపక్షంగా ప్రచారం ప్రారంభించేశారు. దీంతోనే బీజేపీ కుట్రల్ని పవన్ అర్థం చేసుకున్నారని చెబుతున్నారు.
ఏపీలో బీజేపీతో పోల్చుకుంటే జనసేనకే కాస్త ఫాలోయింగ్ ఉంది. బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న కారణంతో తామే గొప్ప అన్నట్లుగా బీజేపీ నేతలు చెలరేగిపోతున్నారు. సోము వీర్రాజు సీఎం అంటూ… ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన పవన్.. తనకు..తన పార్టీని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా… సమస్యల విషయంలో తరచూ పర్యటించాలని భావిస్తున్నారు. అయితే ఎక్కడా బీజేపీని ఆయన ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదు. ఇదే అతి పెద్ద మార్పుగా అంచనా వేస్తున్నారు.