శుభం కార్డు ముందు… `ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది` అనే ఓ హింటు ఇవ్వడం కొంతమంది దర్శకులకు మామూలే. అలా హింటు ఇచ్చిన కొన్ని సినిమాలకు సీక్వెల్ వచ్చింది కూడా. అయితే.. అది సదరు సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. `క్రాక్` కీ… అలాంటి సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు. చివరి షాట్ లో నెంబర్ బోర్డు మీద.. క్రాక్ 2… అని చూపించి.. కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సూచన ప్రాయంగా చెప్పాడు. ఈ సినిమాకి.. వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కూడా చివర్లో `మళ్లీ కలుద్దాం` అంటూ థియేటర్ల నుంచి ప్రేక్షకుల్ని ఇంటికి పంపించాడు. ఈ సినిమాలోని ముగ్గురు ప్రతినాయకులూ.. ఒకే చోట కలవడం, అదే సినిమా చివరి సీన్ కావడంతో, అక్కడి నుంచి క్రాక్ 2 కి బీజం పడొచ్చు. రవితేజ – గోపీచంద్ మలినేనిలది హిట్ కాంబినేషన్. పైగా తనకు కావల్సినప్పుడు.. కావల్సిన సినిమా ఇచ్చాడు గోపీచంద్. అందుకే.. `క్రాక్ 2` విషయంలో రవితేజకు ఎలాంటి అభ్యంతరాలూ లేకపోవొచ్చు. కాకపోతే.. అది `కిక్ 2` కాకుండా జాగ్రత్త పడాలంతే. `కిక్` విషయంలోనూ ఇదే జరిగింది.కిక్ హిట్టవ్వడంతో కిక్ 2 తీశారు. అది.. డిజాస్టర్ గా మారిపోయింది. సేమ్ దర్శకుడు సేమ్ క్యారెక్టరైజేషన్ రిపీట్ అయినా.. ఫలితం రివర్స్ అయ్యింది. అందుకే `క్రాక్ 2` పట్టాలెక్కించేటప్పుడు రవితేజ.. మరింత జాగ్రత్తగా ఉంటాడేమో..?