ముందుగా సీబీఐ కేసుల విచారణే చేపట్టాలని.. వాటిని కొట్టేస్తే ఈడీ కేసులను కూడా కొట్టేసినట్లేనని వాదించిన వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాయర్లకు చుక్కెదురైంది. ఆ మేరకు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించడమే కాదు.. ముందుగా ఈడీ కేసుల్లోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలన్న జగన్ తరపు లాయర్ వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది.
సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని తేల్చింది. ఈ మేరకు ఈడీ వాదనతో ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని… ఈడీ కేసుల్లో అభియోగాల నమోదును ప్రారంభించాలని నిర్ణయించింది. కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది. అరబిందో, హెటెరో విషయంలో ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని.. నిందితులందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి తప్ప.. అందరూ హాజరయ్యారు. ముందుగా సీబీఐ కేసుల విచారణ జరిగితే.. ఎలాగోలా ఆలస్యమో… మరో విధంగానే బయట పడవచ్చనుకున్న జగన్ లాయర్లు.. ఈడీ కోర్టు నిర్ణయం మింగుడు పడనిదే.
సీబీఐ పూర్తిగా క్విడ్ ప్రో కో వ్యవహారాలపై విచారణ జరుపుతుంది. ఈడీ మనీలాండరింగ్ తోపాటు.. ఇతర చట్ట విరుద్ధమైన లావాదేవీలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అభిపోయాగాల నమోదు ప్ర్కరియ ప్రారంభమైతే.. విచారణ ఊపందుకున్నట్లేనని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.