ఆయనేమీ ముద్రగడ పద్మనాభం, ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ కాదు… ఒక కులానికి లేదా కొన్ని కులాలకు చెందిన వారంతా ఆయనను తమ ఆరాధ్యహీరోగా అభిమానించడానికి. ఆయన అటల్ బిహారీ వాజపేయి. మన దేశంలో కులమతాలు, ప్రాంతాలు భాషలు, ఇంకా విపులంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా.. స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉన్న నాయకుడు. ఈ దేశానికి ప్రధానిగా సేవలందించిన వ్యక్తి. తనదైన ముద్ర ఉన్న విలువలను పాలనలో ప్రతిష్ఠించిన వ్యక్తి. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే.. అలాంటి అటల్ బిహారీ వాజపేయిని కూడా ఒక కులానికి ప్రతినిధిలాగా ఓట్ల కోసం వాడుకోవడం. ఈ వాడుకున్నది మరెవరో కాదు.. కాంగ్రెస్ నుంచి భాజపాలోకి ఫిరాయించిన నాయకుడు. ఉప ఎన్నికలో గెలవడానికి ఈ పనిచేశారు.
మహాత్మాగాంధీ జయంతి వస్తే వైశ్యులు మాత్రమే పూజలు నిర్వహించినా, భారతజాతి అన్ని కులాలూ సమానంగా గర్వించదగినట్లుగా రాజ్యాంగ నిర్మాణం చేసిన అంబేద్కర్ ను దళితుల ఓట్లు ఆకర్షించడానికి నాయకులు ఉపయోగించినా ఒక బాధ కలుగుతుంది. ఇప్పుడు వాజపేయి విషయంలోనూ అదే జరుగుతోంది. వాజపేయిని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆదర్శ రాజకీయవేత్తగా ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన భారతీయ జనతా పార్టీనే ఇలాంటి సంకుచితమైన పనికి పాల్పడడం శోచనీయం.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లో మైహర్ ఎమ్మెల్యే సీటు సాధారణంగా కాంగ్రెస్కు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి కాంగ్రెసు నాయకుడు నారాయణ్ త్రిపాఠి గెలిచారు. ఆయన పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. కాకపోతే.. మన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలకున్నన్ని తెలివితేటలు, టెక్నిక్కులు వారికి తెలిసినట్లు లేవు. ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. ఈసారి భాజపా తరఫున బరిలోకి దిగారు. ఉప ఎన్నికలో త్రిపాఠి భాజపా తరఫున పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థిపై 29 వేల ఓట్ల తేడాతో గెలిచారు.
అయితే ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన విరివిగా వాజపేయి ఫోటోలు వాడారుట. అందులో తప్పేముంది అనుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో వాజపేయి కులస్తుల సంఖ్య ఎక్కువట. అందుకే భాజపా గత సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా మరచిపోయిన వాజపేయి ని త్రిపాఠి ఈ ఎన్నికల్లో ముమ్మరంగా వాడారు. నిలువెత్తు ఫోటోలు పెట్టి.. మోడీ ఫోటోలు చిన్నవిగా ముద్రించి ప్రచారం చేసుకున్నారు. వాజపేయి వ్యాఖ్యలను వాడుకున్నారు. ఇదంతా కులపరంగా ఆయనకు ఓట్లు లాభించేలా చేసింది. మొత్తానికి గెలిచాడు. అయితే.. వాజపేయిని కూడా ఒక కులనేతలాగా అడ్డంగా వాడేశారే అని కొందరు మాత్రం బాధపడుతున్నారు.