పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని హైకోర్టు కూడా భావించింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని న్యాయమూర్తి నమ్మారు. అందుకే.. ఎస్ఈసీ ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ తీర్పు చెప్పారు. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు. దీంతో ఓ సింగిల్ బెంచ్.. మరో వెకేషన్ బెంచ్ మాత్రమే అత్యవసర కేసులు వింటున్నాయి. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని ఎన్నికల కమిషనర్ నిర్ణయించుకున్నారు.
ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్ షెడ్యూల్ పేరుతో హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ కొట్టి వేయడం.. న్యాయవాద వర్గాలను… సైతం ఉలిక్కిపడేలా చేసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటూ.. ఈసీ జారీ చేసిన షెడ్యూల్‌ను కొట్టి వేయడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటూ.. ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ వాదనను అంగీకరించింది.
భారత రాజ్యాంగంలో ఎస్ఈసీకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఇంత వరకూ ఎన్నికల షెడ్యూల్ విషంయలో ఏ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టు కూడా తాము జోక్యం చేసుకోలేమని అనేక సార్లు తీర్పు చెప్పింది. ఇంత వరకూ.. ఎన్నికల కమిషన్ విధుల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు.ఇటీవలి కాలంలో.. ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన అనేక పిటిషన్ల విషయంలోనూ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా.. ఇదే అంశాన్ని చెప్పాయి. అనూహ్యంగా హైకోర్టు మాత్రం.. విభిన్నమైన తీర్పు ఇచ్చింది.
ప్రస్తుతం ఏపీలో అన్ని కార్యక్రమాలు సాధారణంగా జరుగుతున్నాయి. అమ్మఒడి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేల మంది ప్రజలను సమీకరించి.. పెద్దగా కోవిడ్ నిబంధనలు పాటించకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా పెరుగుతుందనే వాదనను.. ప్రభుత్వం కోర్టులో వినిపించి మెరుగైన ఫలితం సాధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది.