ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ప్రెస్‌మీట్ పెట్టి.. మాజీ మంత్రి అఖిలప్రియనే సూత్రధారిగా ప్రకటించారు. ఆమె కూకట్‌పల్లిలోని తన లోథా అపార్టుమెంట్ ఫ్లాట్ నుంచి స్కెచ్ వేశారని అంజనీకుమార్ చెబుతున్నారు. సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించి.. మూడు రోజుల కస్టడీకి ఇచ్చిన వెంటనే.. అంజనీకుమార్ ప్రెస్‌మీట్ పెట్టారు. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసుల విషయంలో కమిషనర్ అంజనీకుమార్ … ప్రత్యేకంగా మ్యాప్‌లు వేసి మరీ… మీడియాకు ప్రజెంటేషన్ ఇస్తూంటారు. గతంలో డేటా చోరీ అంటూ జరిగిన వివాదంలోనూ ఆయన ఆధార్ కార్డులు.. ఓటర్ కార్డులు మిస్ అయ్యాయంటూ మ్యాప్ వేసి చూపించారు. ఆ తర్వాత మొన్నటి దుబ్బాక ఎన్నికల సందర్భంగా పట్టుకున్న డబ్బులను బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డబ్బులంటూ.. అలాగే మ్యాప్ వేసి చూపించి విమర్శల పాలయ్యారు. ఆయన గెలిచిన తర్వాత.. అంజనీకుమార్‌కు వ్యంగ్యంగా ధ్యాంక్స్ చెప్పారు.
ఇప్పుడు.. అఖిల ప్రియ విషయంలోనూ.. అలాగే మ్యాప్‌లు వేసి.. ఫోన్ కాల్స్ లెక్క చెప్పి.. అఖిలప్రియే కిడ్నాప్ పేయించిందని ప్రెస్ మీట్ పెట్టి తేల్చేశారు. చాలా మంది కిడ్నాప్ కేసులో ఉన్నారన్న అంజనీకుమార్.. ముగ్గుర్ని మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. నిందితులు వాడిన సెల్ఫోన్లు, నకిలీ నెంబర్ప్లేట్లు సీజ్ చేశామని.. ఆరు సిమ్‌కార్డులను మియాపూర్‌లోని మొబైల్ షాప్లోకొనుగోలు చేసి కిడ్నాప్ కోసం వాడారాని చెప్పుకొచ్చారు. కిడ్నాప్ కోసం అఖిలప్రియ వాడిననెంబర్ ను 70956 37583 మీడియా సమక్షంలో ప్రకటించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు టవర్ లోకేషన్లు ట్రేసింగ్ చేశామని.. అఖిలప్రియ నెంబర్ నుంచి గుంటూరు శ్రీనుకు 49 కాల్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి మధ్య ఎన్నెన్ని కాల్స్ వెళ్లాయో… అంజనీకుమార్ చెప్పుకొచ్చారు.
కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్‌ను ట్రేస్ చేశామని చెప్పుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేసి.. కేసును పూర్తి స్థాయిలో చేధించి.. అసలు కుట్రను.. పూర్వాపరాలను బయట పెట్టాల్సిన పోలీసులు అఖిలప్రియను ఏ-వన్ గా మీడియాలో ప్రచారం చేయించడానికే… ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే… భూమా వారసుడు.. జగత్ విఖ్యాత్ రెడ్డి. మౌనికారెడ్డి ..తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.