స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టి వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను.. ఆ పార్టీ క్యాడర్‌ను.. సోషల్ మీడియాను కూడా ఉత్సాహపరుస్తోంది. ఇప్పుడు వారికి న్యాయవ్యవస్థ, హైకోర్టు, న్యాయమూర్తులు బాగా నచ్చుతున్నారు. గొప్ప తీర్పును న్యాయవ్యవస్థ ఇచ్చిందని పొగిడేస్తున్నారు. గతంలో హైకోర్టు తీర్పుల్ని ఎప్పుడూ పాజిటివ్‌గా తీసుకున్న పాపాన పోని విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా.. వెంటనే.. స్పందించారు. అప్పీల్‌కి చంద్రబాబు ఇంటికి పోతావా.. సుప్రీంకోర్టుకు పోతావా అని ఎకసెక్కాలారు. వైసీపీ నేతల బహిరంగ స్పందన… వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియా స్పందన … రెండూ ఒక్క లాగే ఉన్నాయి.
అయితే.. వీరే గతంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులొచ్చినప్పుడు.. ఎలా మాట్లాడారో.. ఎలా స్పందించారో కాస్త గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే.. కోర్టుని ఎవరో మేనేజ్ చేశారని.. నిందలు వేయడానికి ఏ మాత్రం వెనుకాడని వ్యక్తులు.. సోషల్ మీడియా అకౌంట్లు.. తమకు అనుకూలంగా తీర్పు వచ్చే సరికి.. న్యాయవ్యవస్థ గొప్పదని చెప్పడం ప్రారంభించారు. ఒక వేళ ఈ తీర్పు కూడా.. అనుకూలంగా రాకపోతే.. పాత ఆరోపణలు ప్రారంభించేవారో లేకపోతే… ఇంకో వ్యూహం అమలు చేసేవారో కానీ.. న్యాయవ్యవస్థపై మాత్రం స్పందన నెగెటివ్గనే ఉండేది. తమకు అనుకూలమైన తీర్పులు ఇవ్వకపోతే.. ఎలాంటి ముద్రలైనా వేస్తామని.. అనూకూలమైన తీర్పులు ఇస్తే పొగుడుతామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటి వరకూ వ్యవహరించిన విధానమే ఈ స్పందనలు రావడానికి కారణం అవుతున్నాయి. న్యాయవ్యవస్థను సమానంగా చూడటం ప్రారంభిస్తే.. అన్ని తీర్పులు సమంజసంగానే కనిపిస్తాయి. తీర్పు నచ్చకపోతే.. పై కోర్టుకు వెళ్లడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కానీ న్యాయవ్యవస్థపై నిందలు మోపి..బ్లాక్ మెయిలింగ్ చేసి.. తమకు అనుకూలమైన తీర్పులు తెచ్చుకోవాలన్న వ్యూహమే.. కరెక్ట్ కాదన్న వాదన… వివిధ రంగాల నిపుణుల నుంచి వినిపిస్తోంది.