ఓ సినిమాలో కామెడీ సీన్ ఉంటుంది. నేను తెలియక మా ఆవిడ అనుకుని మీ ఆవిడను వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాను మీరేమీ ఫీలవరు కదా…! అని అడుగుతూ ఉంటుంది ఏవీఎస్ లాంటి క్యారెక్టర్. తానేమీ ఫీల్ కానని బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్ చెప్పినా.. ఆ ఏవీఎస్ మాత్రం ఊర్లో అందరికీ చెబుతూ ఉంటాడు.. ఇప్పుడు ఆ బ్రహ్మానందం పరిస్థితి ఏమిటి..?. సినిమా కాబట్టి ఇది కామెడీగా తీశారు. రియల్‌గా ఆలోచిస్తే… అలాచెప్పే ఏవీఎస్‌ను చంపేయాలన్నంత కోపం.. సదరు బ్రహ్మానందం క్యారెక్టర్‌కి వస్తుంది. వచ్చింది.. చంపేశారు కూడా. తెలంగాణలోని జహీరాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసును చేధించిన పోలీసులకు కారణం తెలిసి అవాక్కయ్యారు.
ఐదు రోజుల కిందట… జహీరాబాద్ సమీపంలో ఓ చెక్‌డ్యాంలో గుర్తు తెలియని మృతదేహాం బయటపడింది. అది దారుణహత్య. కాళ్లు, చేతులు, మొండెం వేరుచేసి ఓ సంచిలో మూటగట్టి చెక్‌డ్యాంలో పడేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముందుగా హతుడెవరో గుర్తించారు. అతని జహీరాబాద్ శివారులో కర్ణాటకలోకి వచ్చే ఓ గ్రామానికి చెందిన వైద్యనాథ్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత కేసు విషయాన్ని తేలిగ్గానే తేల్చేశారు. ఆ తర్వాత నిందితుల్ని కూడా పట్టుకున్నారు. అంతా తేలాక నిందితులు ఎవరంటే.. వైద్యనాథ్ భార్య, పిల్లలు. ఎందుకు చంపారో కారణం తెలుసుకుని పోలీసులు కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చంది.
పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ.. వైద్యనాథ్‌కు భార్యపై అనుమానం. ఆమెకు ఎవరితోనే వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ ఉంటారు. ఆ అనుమాన వేధింపులు ఇంట్లోనే ఉంటే… ఎలాగోలా సర్దుకునేవారేమో..? కానీ ఇంటి గుట్టును ఊళ్లో పెట్టేశాడు. ఊళ్లో అందరికీ చెప్పి… ప్రచారం చేయడం ప్రారంభించాడు. దీంతో కుటుంబం పరువు పోతుందని విసుగు చెందిన భార్య, కుమారులతో కలిసి హత్య చేసింది. వైద్యనాథ్‌ను ఇంటిలో బంధించి.. తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం తల, కాళ్లు, చేతులు వేరు చేసి ఓ సంచిలో కుక్కి తెలంగాణ సరిహద్దు గ్రామంలోకి తెచ్చి పడేశారు. చివరికి పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.