రామ రథయాత్ర పేరుతో … రామతీర్థం నుంచి ఆలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించాలని బీజేపీ నిర్ణయించుకుంది. కానీ జనసేనను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మళ్లీ రగడ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకున్నా…జనసేనతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్న ఓ కట్టుబాటు పొత్తు సమయంలోనే పెట్టుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్… మొదట్లో తాను ప్రకటించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీల పేరుతో కాలయాపన జరిగింది కానీ…ఉమ్మడి కార్యాచరణ లేకుండా పోయింది.
ఇప్పుడు మళ్లీ రెండు పార్టీలు రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికైతే విడివిడిగా.. ఎవరి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. జనసేనపై సవారీ చేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని చెప్పేలా కార్యచరణ ఖరారు చేసుకుంటోంది. ఇప్పటికే జనసైనికులు.. తమ పార్టీని బీజేపీ వ్యూహం ప్రకారం నిర్వీర్యం చేస్తోందన్న అనుమానంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ క్రేజ్ ను వాడుకుంటూ బీజీపీ రాజకీయం చేస్తూ.. ఆయన పార్టీని మాత్రం పట్టించుకోవడం లేదన్న అసహనంలో ఉన్నారు. దీనిపై పై స్థాయి నేతలు కూడా.. బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే.. రథయాత్ర విషయంలో జనసేనను కూడా భాగస్వామిని చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంగానే ఓ కమిటీని జనసేన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే.. రథయాత్ర అని కాకుండా.. రామతీర్థం విషయంలో.. బీజేపీతో కలిసి పోరాడేందుకు.. జనసేన అధినేత కమిటీని ఏర్పాటుచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఉంటుందని… రామతీర్థం ఘటనలో కేసులో సత్వర న్యాయం కోసం బీజేపీతో కలిసి కమిటీ పనిచేస్తుందని పవన్ చెబుతున్నారు. ఈ కమిటీ ఎలా సమన్వయం చేసుకుని బీజేపీ చేస్తున్న రథయాత్రలో ఎక్కువ మార్కులు జనసేనకు వచ్చేలా చేసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.