కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా… వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం కావడమో… లంచ్ లేదా స్నాక్స్ సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఏకాభిప్రాయం రాలేదని వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా తొమ్మిదో విడత చర్చల్ని నిర్వహించారు. మూడు గంటల పాటు మాట్లాడుకుని… నిర్మాణాత్మకంగా చర్చలు జరగలేదని.. పదోసారి భేటీ కావాలని అనుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
నిజానికి వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత రైతులు.. తమ విజయం వచ్చేసిందనుకుని వెళ్లిపోతారని.. కేంద్రం అనుకుంది. కానీ.. సుప్రీంకోర్టు నియమించిన కమిటీని చూసిన తర్వాత వారికి సమ్ధింగ్ రాంగ్ అనిపించింది. వెంటనే.. స్టే ఇచ్చినా పోరాటం ఆపేది లేదని ప్రకటించేశారు. తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిచాలని అంటున్నారు. కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తామని కేంద్రం అంటోంది కానీ… చట్టాలను రద్దుచేసే ప్రశ్నే లేదంటోంది. దీంతో చర్చల ప్రక్రియ ముడిపడిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితేనే… చర్చలు ముందుకెళ్తాయి. లేకపోతే.. ఎక్కడివక్కడే ఉండిపోయాయి.
అయితే.. ఎవరూ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. కానీ చర్చలు మాత్రం జరుపుతూనే ఉన్నారు. నిజానికి రైతులు.. మధ్యలో నాలుగు విడతల చర్చల తర్వాత … ఇక చర్చలకు వచ్చేది లేదన్నారు. కానీ.. తర్వాత ఎందుకో కానీ.. చర్చలకు సిద్ధమని ప్రకటించారు. వారి వైపు నుంచి మొండి పట్టుదల ఉందన్న అభిప్రాయం రాకుండా ఉండేందుకు వారు చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తమ డిమాండ్లపై మాత్రం వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. అనుకున్నది అనుకున్నట్లుగా పోరాడుతున్నారు. కేంద్రం కూడా అంతే పట్టుదలగా ఉంది. సుప్రీంకోర్టు స్టేతో కాస్త పరిస్థితి మారుతుందని కేంద్రం అనుకుంది కానీ.. ఇంకా బిగిసినట్లయింది.