“పీఎం కేర్స్ ఫండ్”. కరోనా టైంలో కార్పొరేట్లు.. సాధారణ ప్రజలు విరాళివ్వడానికి ఏర్పాటు చేసిన వేదిక. అయితే ఈ ఫండ్ నిర్వహణసరిగ్గా లేదని ఎవరు విరాళం ఇస్తున్నారు.. ఎంత ఇస్తున్నారు.. దేనికి ఖర్చు చేస్తున్నారో స్పష్టత లేదని ఆరోపణలు వస్తున్నాయి. పారదర్శకత లేకపోవడంతో… తాజాగా వంద మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. పారదర్శకంగా ఆ ఫండ్‌కు సంబంధించిన అన్ని వివరాలు బయట పెట్టి.. ప్రజల్లో అపోహలు తొలగించాలని వారు లేఖలో కోరారు. ఏకంగా వంద మంది మాజీ అఖిలభారత సర్వీసు అధికారులు లేఖ రాయడం… ఆసక్తికరంగా మారింది.
పీఎం-కేర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఈ నిధిని గత ఏడాది మార్చిలో మోడీ ప్రారంభించారు. మోడీ ఇలా ప్రారంభించడం ఆలస్యం.. అలా కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఐదు రోజుల్లోనే మూడు వేల కోట్లు జమ అయ్యాయి. అయితే మొదట్లో వివరాలు చెప్పిన అధికారులు తర్వాత సైలెంటయ్యారు.ఇది అసలు ప్రభుత్వానిదా? లేక ప్రైవేటుదా? అనే చర్చ కూడా జరిగింది. వివరాలు చెప్పేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఇది ప్రభుత్వ అధీనంలోనే ఉంది కానీ.. ప్రైవేటు విరాళాల ద్వారా వస్తున్నది కాబట్టి ఆర్టీఐ చట్టం కూడా వివరాలివ్వబోమని అధికారులు దరఖాస్తు చేసుకున్న వారికి చెబుతున్నారు.
ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ట్రస్టీలుగా ఉన్నప్పటికీ.. దీన్ని ప్రభుత్వ ట్రస్ట్‌గా చెప్పడం లేదు. వాస్తవానికి ప్రధానమంత్రి సహాయనిధి అనేది ఎప్పటి నుండో ఉంది. ఎవరైనా విరాళాలివ్వాలంటే దానికి ఇస్తారు. దానికి చట్టబద్ధత ఉంది. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి లెక్క పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి కేవలం కరోనాపై పోరాటం కోసమంటూ… పీఎంకేర్స్ ప్రారంభించారు. వచ్చిన విరాళాలు.. చేస్తున్న ఖర్చుపై పారదర్శకత లేకపోవడంతో.. అందరిలోనూ అందులో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరగడానికి కారణం అవుతున్నాయి. నిధికి సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగ పరచాలనేదే.. ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్న డిమాండ్. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నిర్వహిస్తున్న నిధిలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని తాజాగా లేఖలు రాసిన మాజీ ఐపీఎస్,ఐఏఎస్‌లు అంటున్నారు.