స్మార్ట్ ఫోన్ అంటే ఎగబడని జనాలు ఉండరు ఒకవైపు ఐఫోన్ లాంటివి అరవై డెబ్భై వేల నుంచీ కనిష్టంగా చూస్తే ఇరవై పాతిక వేలకు ధరల శ్రేణిలో ఉండగా వాటి మీద మనసు పారేసుకునే వారు చౌకగా లభిస్తే కొనుక్కుంటారనేమోనని అదే మాడల్స్లో ఐదారువేల రేంజిలో స్మార్ట్ పోన్లు తయారుచేస్తూ చిన్న కంపెనీలు సొమ్ముచేసుకుంటున్నాయి. నిజానికి స్మార్ట్ ఫోన్ ఉండగల ధర ఎంత అనే విషయంలో స్పష్టత లేదు. ఒక కంపెనీ ఒకే రకమైన ఫీచర్లను ఐదారువేల ధరలకు అందిస్తుంటే మరో కంపెనీకి ముప్పై నలబై వేలకు ఎందుకు అందిస్తున్నదో ఎవ్వరికీ బోధపడదు. ఇలాంటి సందేహాలు ఎవరికైనా ఎప్పుడైనా కలుగుతాయో లేదో తెలియదు గానీ, భారతీయ కంపెనీ రింగింగ్స్ 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందిస్తాం అంటూ ఇప్పుడు కొత్త ప్రకటనతో ముందుకు వస్తోంది. పైగా ఈ కంపెనీ ప్రారంభించబోతున్న బుకింగ్స్ ను సాక్షాత్తు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించబోతుండటం మరింత విశేషం.
ఎంత తక్కువ ధరలో తయారు అయినప్పటికీ కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తుందా. అనేది చాలా మందికి కలుగుతున్న సందేహం. ఎంత చవగ్గా తయారుచేసినప్పటికీ.. వారు చెబుతున్న ఫీచర్లతో అంత తక్కువ ధరకు అందించడం అసాధ్యం అనే… తయారీ రంగ నిపుణులు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాబ్లను ప్రజలందరికి అందుబాటులోకి తీసుకువస్తామనీ, అత్యంత చౌక ధరల్లో ట్యాబ్లను దేశంలో అందరికీ ప్రతి విద్యార్థికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తామనీ, రకరకాల ప్రకటనలు గుప్పించారు. ఒక సంస్థ పేరుతో అందరినీ బుకింగ్ చేసుకోవల్సిందిగా సూచించారు. కపిల్ సిబల్ తన పదవీ కాలం మొత్తం దీని ప్రచార కర్తలాగానే వ్యవహరించారు. అప్పట్లో డబ్బులు ముందుగా చెల్లించవలసిన అవసరం లేకపోపయినప్పటికీ కేవలం తమ వివరాలన్నిటినీ నమోదు చేసుకుంటే నాలుగైదు నెలల వ్యవదిలోగా వారికి ఫోన్లను అలాట్ చేయటం జరుగుతుదంటూ ప్రకటనలు చేయటంతో వెల్లువెత్తించారు. అయితే ఏళ్లూపూళ్లూ గడిచిపోయాయిగానీ సదరు చౌక ధరల ట్యాబ్లు మాత్రం జనాలకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ సుమారు నాలుగైదేళ్లు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించిన ట్యాబ్లు మాత్రం మార్కెట్లో ఎక్కడా కనిపించడం లేదు.
ఇప్పుడు రింగింగ్ బెల్స్ వారు చెబుతున్న స్మార్ట్ ఫోన్ సంగతి కూడా ఏమిటీ, 251 రూపాయలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తామంటూ బుకింగ్లు ప్రారంబిస్తున్నవారు నిజంగానే నాలుగైదు నెలలుగా బుకింగ్ చేసుకున్న వారికి స్మార్ట్ ఫోన్ల్ను పంపేంత వెసులుబాటుతో ఉన్నారా. లేకా కేవలం బుకింగ్లు పూర్తిచేసి అక్కడితో దుకాణం సర్దేస్తారా అనేదికూడా కొంత మందిలో కలుగుతున్న సందేహం. గతంలో ట్యాబ్ల అనుభవం దృష్టా ఇప్పుడు ఈ చౌకధరల స్మార్ట్ ఫోన్ల వ్యవహారం ఎంతమేరకు కార్యాచరణలో నిలబడేదీ, ఎంతమేరకు విఫలమయ్యేది అనే అనుమానాలతో ప్రజలు దీన్ని గమనిస్తున్నారు.