కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం తమ వద్ద ఉందని.. జైలుకు పంపుతామని అదే పనిగా బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని బండి సంజయ్ వారానికోసారి చెబుతూ ఉంటారు. అవినీతి ఆధారాలతో కోర్టులను ఆశ్రయిస్తామని కూడా చెబుతూంటారు. కానీ తాజాగా బీజేపీ అలాంటి మాటలన్నీ కట్టి పెట్టి… వచ్చే రెండేళ్ల పాటు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఉద్యమాలు సంవత్సరాలనీ… పోరాడి తెలంగాణ రాష్ట్ర సమితిపై విజయం సాధిద్దామని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. తాజాగా తరుణ్ చుగ్ వచ్చి ఇచ్చిన సందేశం మేరకు.. తెలంగాణలో ఈ టర్మ్ పూర్తయ్యే వరకూ.. కేసీఆర్‌కు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్న సారాంశం ఉందని చెబుతున్నారు.
కేంద్రానికి బేషరతుగా కేసీఆర్ మద్దతు పలుకుతున్నందున.. గతంలోలా… ఆయనపై విమర్శల దాడి చేయలేమన్న అభిప్రాయానికి బీజేపీ నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కేంద్రానికి సపోర్ట్ చేస్తూంటే బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని.. అయితే అదే సమయంలో టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులు… ఉండవనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేలా కార్యాచరణ ఉండాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు కాకుండా.. వచ్చే రెండేళ్ల ప్లాన్ ను ఖరారు చేసుకున్నారు. రెండేళ్ల పాటు సుదీర్ఘమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని తరుణ్ చుగ్ .. కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపు కూడా.. టీఆర్ఎస్ నేతలకు సానుకూలంగానే వెళ్తోంది.
కేసీఆర్ నేరుగా యుద్ధం ప్రకటిస్తే… బీజేపీ నేతలు తాము కూడా కత్తి దూసేవారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కేసీఆర్ కేంద్రం చర్యలన్నింటికీ మద్దతు పలుకుతున్నారు. బీజేపీని పల్లెత్త మాట అనవద్దని క్యాడర్‌కు సంకేతాలు పంపారు. కేటీఆర్ కూడా కలసి పని చేద్దామని బహిరంగంగానే పిలుపునిచ్చారు. దీంతో ప్రజల్లో కూడా ఓ రకమైన అనుమాన బీజాలు పడ్డాయి. ఇప్పుడు బీజేపీ నేతల్లో … టీఆర్ఎస్తో ఎలా వ్యవహరించాలన్న మీమాంస ప్రారంభమయింది. ఈ కారణంగా… గ్రేటర్ ఎన్నికలకు ముందు ఉన్న వేడి ఇప్పుడు లేదు. ఎంఐఎంతో లింక్ పెట్టేసి విమర్శలు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో నిన్నటిదాకా తిరుగు లేకుండా ఉందనుకున్న పరిస్థితి ఇప్పుడు… కేసీఆర్ “దగ్గరి సంబంధాల” ప్రచారంతో మార్చే ప్రయత్నంలో ఉండటంతో… తాము కూడా మారక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
కేంద్రంతో గొడవలు పెట్టుకున్న వారికి… కేసుల చిక్కులు వచ్చి పడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కానీ.. మంచి సంబందాలున్న వారు జైలుకు పోయిన సందర్భం లేదు. కాబట్టి.. కేసీఆర్ కూడా ఇప్పుడు… స్థానిక బీజేపీ నేతలు ఎలాంటి మాట్లాడినా.. ఢిల్లీ నుంచి వస్తున్న నేతలు ఇస్తున్న సందేశంతో ఖుషీగానే ఉన్నారని అనుకోవచ్చు.