దేశంలో రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలున్నప్పటికీ.. వాటిని రాజకీయ సెంటమెంట్లుగా మార్చడానికి రాజకీయ నేతలు పెద్దగా సిద్ధపడలేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారుతోంది. నయా రాజకీయ నాయకులు.. దేనికైనా తెగబడుతున్నారు. మహారాష్ట్ర సర్కార్.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలపై కన్నేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న మరాఠా ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకుంటామని.. ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరే అధికారికంగా ప్రకటించారు. అలా చేయడమే మరాఠీ అమర వీరులకు అసలైన నివాళి అని ఆయన చెబుతున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలున్నాయి. కర్ణాటకలో ఓ ప్రాంతాన్ని మరాఠీ కర్ణాటకగా పిలుస్తారు. మరో ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగా పిలుస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటుచేసినప్పుడు… వాటిని కర్ణాటకలో చేర్చారు. అయితే అక్కడ కన్నడ సంస్కృతి కన్నా… మరాఠీ, నిజాం సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో.. కర్ణాటకలో కలిసిన హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలను కూడా… కలుపుకోవాలన్న డిమాండ్ వినిపించింది. కేసీఆర్ కూడా 1956కి ముందున్న తెలంగాణ కావాలన్న డిమాండ్ చేశారు. తర్వాత… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేస్తే చాలన్నట్లుగా ఉద్యమం చేశారు. దాంతో ఆ వివాదం పెద్దది కాలేదు.
కానీ మహారాష్ట్ర సర్కార్ మాత్రం ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. బెళగావి, కర్వార్, బీదర్, నిప్పని తదితర ప్రాంతాలు ఒకప్పుడు మహారాష్ట్రలోనే ఉండేవి. ఇప్పటికీ అక్కడి ప్రజలు మరాఠీనే ఎక్కువగా మాట్లాడతారు. అందుకే ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్ తో ఉద్యమాలు చేసే సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు.. వాటిని మహారాష్ట్రలోనే ఉంచాలని ఉద్యమాలు జరిగాయి. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో కొంత మంది చనిపోయారు. వారి సంస్మరణ దినం సందర్భంగా… ఈ అంశాన్ని ఉద్దవ్ ధాకరే హైలెట్ చేశారు. నిజానికి ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.