ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఓ జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మూడు రోజుల కిందట.. ఆ జనసేన కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఆ కార్యకర్త ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త పేరు వెంగయ్యనాయుడు. గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో ఉంటాడు. ఆయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటాడు. తన గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను.. రోడ్లు, పారిశుద్ధ్య పరిస్థితి బాగో లేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కోపం వచ్చింది. తననే ప్రశ్నిస్తావా అని ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. తాగుబోతుగా అభివర్ణించారు. మెడలో కండువా తీయమని గద్దించారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… వెంగయ్యపై వైసీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిని తట్టుకోలేక.. వెంగయ్య ప్రాణఆలు తీసుకున్నాడు. ఈ ఘటనపై తెలుసుకున్న పవన్ కల్యాణ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు అధికారపక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పెలా అవుతుందని.. తక్షణం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించి ఎమ్మెల్యే, అనుచరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల నేతలకు. కార్యకర్తలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో.. వెంగయ్య ఉదంతం స్పష్టత నిస్తోందని.. జనసేన నేతలు అంటున్నారు.
గతంలో కడప జిల్లాలో ఇలా అవినీతి, అక్రమాలను ప్రశ్నించారని.. హత్యలు కూడా జరిగాయి. అనేక చోట్ల.. వేధింపులకు తాళ లేక.. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కోడెల లాంటి నేతలు కూడా తట్టుకోలేకపోయారని గుర్తు చేస్తున్నారు. జనసేన కార్యకర్త ఆత్మహత్య ఉదంతాన్ని వదిలి పెట్టకూడదని.. తీవ్ర స్థాయిలో పోరాటం చేసి తమ క్యాడర్‌కు ధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో జనసేన నేతలున్నారు. విశేషం ఏమిటంటే.. అన్నా రాంబాబు పీఆర్పీ నుంచే మొదటి సారి ఎమ్మెల్యేగా గిద్దలూరు నుంచే గెలిచారు.