ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు అధికార మర్యాదలు అంటే ప్రోటోకాల్ దక్కడం లేదని అదే పనిగా కన్నీరు పెట్టుకున్న రోజాకు..సొంత ప్రభుత్వంలోనూ అదే డ్యూటీ తప్పడం లేదు. తాజాగా ఆమె మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన శాసనసభ ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన నియోజకవర్గంలో ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని.. తనకు కనీస సమాచారం కూడా రావడం లేదని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఏడ్చారు. టీటీడీలో కూడా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ ఒక్క సారిగా బ్లాస్ట్ అయి బోరున విలపించారు.
రోజా ఒక్క సారిగా ఏడవడంతో కమిటీ సభ్యులు కూడా స్టన్ అయ్యారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడడం తమ బాధ్యతని చెప్పి సర్ది చెప్పారు. రోజా నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గమే ఎక్కువ. మంత్రి పదవికి ఎక్కడ పోటీ వస్తుందో అన్న ఉద్దేశంతో ఆమెను నియోజకవర్గంలో బలహీనం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అధికారిక కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం వెళ్లడం తక్కువే. అంతే కాదు.. ఆమె ను వ్యతిరేకించే వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతీ గ్రామంలోనూ పెద్దిరెడ్డి వర్గం ఉంది.
దీంతో.. రోజా నగరిలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. చివరికి అది.. ఏడుపు రూపంలో బయటకు వచ్చిందని భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… కూడా ఆమె అసెంబ్లీ ప్రవిలేజ్ కమిటీ సమావేశాల్లో ఏడిచారు. అప్పుడు.. ఆమె అసభ్యంగా మాట్లాడినందుకు వేటేశారు. వాటిపై వివరణ ఇచ్చేందుకు వచ్చి విలపించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి… ప్రోటోకాల్ కోసం కన్నీరు పెట్టాల్సి వచ్చింది.