సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు త్రినాథరావు నక్కిన. ఒక్కసారిగా పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. వెంకటేష్, రవితేజల కోసం కథలు సిద్ధం చేశాడు. వెంకటేష్‌తో దాదాపు ఖాయం అనుకున్న దశలో.. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తరవాత… రవితేజతో ట్రావెల్ మొదలెట్టాడు. అయితే… త్రినాథరావు ని పక్కన పెట్టి, మిగిలిన కథల్ని పట్టాలెక్కించడం మొదలెట్టాడు రవితేజ. ఎంతకాలమని సినిమా కోసం వెయిట్ చేయడం.. అందుకే మరో హీరోని వెదుక్కున్నాడు త్రినాథరావు.
ఎట్టకేలకు ఇప్పుడు హవీష్ తో సినిమా చేస్తున్నాడట. `నువ్విలా` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హవీష్. ఆ సినిమా హిట్టయినా క్రెడిట్ మొత్తం రవిబాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తరవాత.. `జీనియస్`, `రామ్ లీలా`, `సెవెన్` చేశాడు. ఏవీ ఆడలేదు. ఇప్పుడు త్రినాథరావు నక్కిన.. హవీష్ తో ఓసినిమా చేస్తున్నాడు. ఇది రవితేజ కోసం రాసుకున్న కథే అని తెలుస్తోంది. రవితేజ కథ… హవీష్‌కి ఎలా సెట్ చేశారో మరి..? సినిమా సినిమాకీ ఎదగాలని, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తుంటారు దర్శకులు. కానీ.. త్రినాథరావు మాత్రం రివర్స్ గేర్ మంత్రం పాటిస్తున్నాడు. హీరోలు దొరక్కపోతే దర్శకులు మాత్రం ఏం చేస్తారు? దొరికిన వాళ్లతోనే సర్దుకుపోతారు. త్రినాథరావు నక్కిన కూడా అంతే ఇప్పుడు.