భారతీయ దర్శకులలో శంకర్ ది విభిన్నమైన శైలి. రెండు మూడేళ్లకు ఒక సినిమానే తీస్తుంటాడు. అందులో తన ప్రత్యేకతలు ఉండేలా జాగ్రత్త పడతాడు. శంకర్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. భారీ ఆలోచనలు, భారీ బడ్జెట్ లూ, పెద్ద హీరోలూ.. ఇదే శంకర్ శైలి. `ఐ` వరకూ ఫ్లాప్ అన్న మాటే ఎరగడు. `రోబో 2` అంతగా రక్తి కట్టకపోయినా శంకర్ ఇమేజ్ పై వచ్చేన ప్రభావం ఏమీ లేదు. ఇప్పుడు `భారతీయుడు 2` పనిలో ఉన్నాడు శంకర్.
శంకర్ ఓ తెలుగు సినిమా చేస్తున్నట్టు.. అందులో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నట్టు ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అది ఎలా పుట్టిందో, అందులో నిజాలెంతో తెలీదు గానీ, టాలీవుడ్ ని షేక్ చేసే వార్తే అది. కానీ.. ఈ కాంబో అయ్యే పనేనా? అన్నది పెద్ద ప్రశ్న. శంకర్ సినిమాలేవీ ఓ పట్టాన తెవలవు. ఆ విషయంలో.. రాజమౌళి కంటే.. చాదస్తం ఎక్కువ. `భారతీయుడు 2` ఎప్పుడో మొదలెట్టాడు. ఇప్పటి వరకూ సగం సినిమా కూడా పూర్తవ్వలేదు. అదెప్పుడు అవుతుందో తెలీదు. దానికి తోడు శంకర్ కి ఇది వరకటి కమిట్మెంట్స్ ఉన్నాయి.ఇటు పవన్, అటు చరణ్ ఇద్దరూ బీజీనే. వాళ్లిద్దరినీ టై అప్ చేసేంత సమయం.. ఎప్పుడు చిక్కాలి? పైగా శంకర్ తెలుగులో సినిమా చేయడానికి ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. చిరంజీవి అంతటి వాడే… `నాతో ఓ సినిమా చేయ్` అని ఆఫర్ ఇచ్చినా శంకర్ పట్టించుకోలేదు. మహేష్ తో శంకర్ ఓ సినిమా చేస్తాడని ఇది వరకు వార్తలొచ్చాయి. చాలా ఏళ్లు మహేష్ – శంకర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. అది కాస్త మరుగున పడిపోయింది. ఇప్పుడు పవన్ – చెర్రీల కాంబో అంటున్నారు. నిజంగా ఈ సినమా సెట్ అయితే సంతోషమే. కానీ.. శంకర్ స్టైల్ తెలిసినవాళ్లెవరైనా `ఇది అయ్యే పని కాదు` అంటూ లైట్ తీసుకుంటున్నారు.