విశాఖ రైల్వేజోన్ కోసం టీడీపీ హయాంలో ఉద్యమాలు జరిగాయి. టీడీపీ కూడా.. కేంద్రాన్ని ప్రశ్నించి.. ప్రశ్నించి బయటకు వచ్చిన తర్వాత …కేంద్రం ఆ జోన్ ప్రకటించింది. అందులోనూ కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. ఏదో జోన్ అయితే ప్రకటించారు. తర్వాత ఏదో ఒకటి విస్తరించుకోవచ్చని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారింది. ప్రకటించిన జోన్ విషయంలో ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికి రెండేళ్లవుతోంది. నిజానికి రైల్వేజోన్ ఏర్పాటు కావాలంటే.. నాలుగైదు నెలల సమయం పడుతుంది. కానీ ఆ ఏర్పాటు ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.
రైల్వేజోన్‌కు సంబంధించి ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకూ ఒక్క అడుగు కూడా మందుకు పడలేదు. రైల్వేజోన్ ఏర్పాటుకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం వాటి కోసం.. బడ్జెట్‌లో రూ. మూడు కోట్ల నిధులు కేటాయించారు. కానీ వాటితో పనులు ప్రారంభించలేదు. 0అసలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉందా లేదా.. అన్నదానిపై అక్కడి ప్రజలకే క్లారిటీ లేకుండా పోయింది. ప్రజల్ని సెంటిమెంట్లతో ఆడుకోవడానికే రాజకీయ నేతలు అవసరం ఉన్నప్పుడల్లా ఈ జోన్ అంశాన్ని తెరపైకి తెస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా.. ఈ విషయంలో… పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఏపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ విషయంలో ఆసక్తి చూపకపోవడానికి అసలు జోన్‌ను విజయవాడకు మార్చాలనే ప్లాన్ ఉందంటున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తే.. రైల్వే జోన్ కూడా అక్కడే ఎందుకని… విజయవాడకు మార్చాలన్న డిమాండ్లు కొంత మంది వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోస్తాకు అన్యాయం చేశారన్న భావన రాకుండా… విశాఖను క్యాపిటల్ చేసి.. జోన్ ను విజయవాడకు ఇచ్చామని చెప్పుకోవడానికి పనికొస్తుందన్నట్లుగా వైసీపీ ఈ విషయంలో సైలెంట్ గా మారిదంని.. సరైన సమయంలో… ఆ అస్త్రాన్ని బయటకు తీస్తారని చెబుతున్నారు. మొత్తానికి ప్రజోపయోగ అంశాలన్నింటినీ రాజకీయంతో ముడిపెట్టి.. ఎటూ కాకుండా చేయడంలో రాజకీయ నేతలు చాలా ముందుంటారని… విశాఖ రైల్వేజోన్ అంశమే సాక్ష్యం.