రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ కిలారు రాజేష్ అనే వ్యక్తి సీఐడీ కేసులపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఐపీసీ సెక్షన్లు వర్తించవని స్పష్టం చేసింది. అసలు.. తనకు భూమి అమ్మిన వారెవరూ ఫిర్యాదు చేయకుండానే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారని కిలారు రాజష్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అమరావతి భూముల విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజధాని విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకునికొంత మంది అనుచరులతో కనిపించి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని ఇన్సైడర్ ట్రడింగ్ చేశారని ప్రభుత్వాధినేత జగన్ ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలకు తగ్గట్లుగా సీఐడీ అధికారులు.. ఆ సమయంలో భూములు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీలో లేదని.. అది స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అంశమని.. చాలా మంది వాదిస్తున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎలా నేరమని ప్రశ్నలు వచ్చాయి. దీన్నే హైకోర్టు ధృవీకరించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద.. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టలేరని తేల్చేసింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అనేక మంది టీడీపీ నేతలనే కాదు.. అసలు అమరావతి పీక నొక్కడానికి కూడా.. ప్రభుత్వం ఈ వాదనను వినియోగించుకుంది. కొన్ని వేల మంది రైతులు అక్కడ ఆందోళనలు చేస్తూంటే పట్టించుకోకుండా… అవన్నీ బినామీలవేనని.. రైతులు పెయిడ్ ఆర్టిస్టులంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో… అసలు ఇన్ సైడర్ ట్రేడింగే లేదని హైకోర్టు తీర్పు చెప్పడం… సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మున్ముందు అమరావతి పరిణామాలు వేగంగా మారడానికి ఈ కోర్టు తీర్పు కీలకం అయ్యే అవకాశం ఉంది.