పాస్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాను విగ్రహాలను ధ్వంసం చేశానని.. వందల కొద్దీ గ్రామాలను మత మార్పిడి చేసేసి క్రిస్టియన్ గ్రామాలుగా చేసేశానని అయన చెబుతున్నారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత వరకూ మీడియా ముందు ప్రవేశ పెట్టలేదు. అసలు ఆయనపై ఏ కేసులు పెట్టారో.. ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. వివిధ పార్టీల నేతలు మీడియా ప్రకటనలు చేసిన తర్వాత పోలీసులు కాస్త హడావుడి ప్రారంభించారు. అరెస్ట్ చేసిన వారం రోజుల తర్వాత సోదాలంటూ… ఆయన స్వగ్రామానికి వెళ్లారు.
ఎనిమిది మంది సభ్యులు ఉన్న సీఐడీ బృందం.. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బ్రహ్మానందపురం అనే గ్రామంలో ప్రవీణ్ చక్రవర్తికి చెందిన స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అప్పటికే…ఆ కాలేజీలు ఇళ్ల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని ప్రవీణ్ చక్రవర్తి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. సీఐడీ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన ఆధారాలు దొరికాయని సీఐడీ అధికారులు మీడియాకు చెప్పుకొచ్చారు. విగ్రహాలను ధ్వంసం చేశానని ప్రవీణ్ చెబుతున్నాడని… సైంటిఫిక్ ఆధారాల కోసం వెదుకుతున్నామన్నారు. అలాగే.. మత మార్పిళ్లు చేశామని చెబుతున్న గ్రామాలను కూడా సందర్శిస్తామని అంటున్నారు. ప్రవీణ్ నివాసంలో దొరికిన ఆధారాలతో మరింత చురుగ్గా విచారణ చేస్తామంటున్నారు.
మత మార్పిళ్లతో పెద్ద ఎత్త విదేశాల నుంచి నిధులు సమీకరించి.. స్కూళ్లు, సేవా కార్యక్రమాలు అంటూ హడావుడి చేయడంలో ప్రవీణ్ కుమార్ దిట్ట అన్నప్రచారం జరుగుతోంది. అసలు ప్రవీణ్ కుమార్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తేల్చాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. బ్రదర్ అనిల్‌కు చెందిన మత సంస్థతో.. ప్రవీణ్‌కుమార్‌కు అనుబంధం ఎక్కువని చెబుతున్నారు. అందుకే బ్రదర్ అని సంస్థల్లోనూ సోదాలు చేయాలని అంటున్నారు. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి శిక్షిస్తున్నట్లుగా కాకుండా.. కాపాడుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.