జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అరాచకాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే తిట్లు.. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడుని పరామర్శించడానికి నేరుగా పవన్ కల్యాణ్ వెళ్తున్నారు. ఇప్పటికే వెంగయ్య కుటుంబానికి పవన్ కల్యాణ్ అండగా ఉంటామని ప్రకటించారు. రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా అందచేయనున్నారు. శుక్రవారం పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్తారు. శనివారం రోజు.. వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సాయం అందచేస్తారు.
ఆ సమంయలోనే వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. వెంగయ్యనాయుడు ఆత్మహత్య విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పటికే.. ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు… వెంగయ్యను బెదిరించిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు గ్రామంలో కొంత మందిపై తూ..తూ మంత్రంగా కేసులు పెట్టారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేపై కేసులు పెట్టే వరకూ అక్కడే ఉంటానని.. ప్రకటించి పోరాటం ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది.
ఎదురు తిరిగి పోరాడకపోతే.. వైసీపీ నేతలు.. కార్యకర్తలు వేధిస్తూనే ఉంటారని.. వారికి అధికారులు సహకరిస్తూనే ఉంటారని.. భావిస్తున్నారు. తిరగబడి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరవై మూడో తేదీ న గిద్దలూరులో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.