అనుష్క కెరీర్ ఇప్పుడు గందరగోళంలో వుంది. తానిప్పటికీ స్టార్ హీరోయినే.కానీ.. దానికి తగ్గట్టు సినిమాలు చేయడం లేదు. తన కెరీర్ లో ఇది వరకటి స్పీడు లేదు. `నిశ్శబ్దం`పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ… ఫలితం రాలేదు. పైగా.. లావుగా మారిపోయింది, బొద్దుగా వుంది.. అన్న కామెంట్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు స్వీటీ మరో రిస్క్ చేస్తోంది.
యూవీ క్రియేషన్స్ లో అనుష్క ప్రధాన పాత్రగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. మహేష్ దర్శకుడు. ఇది వరకు `రా… రా.. కృష్ణయ్య` అనే సినిమా తీశాడు మహేష్. అందులో సందీప్ కిషన్ హీరో. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత.. మహేష్ మరో సినిమా చేయలేదు. ఇప్పుడు అనుష్కకి ఓ కథ చెప్పి ఒప్పించగలిగాడు. ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడం ఎప్పుడూ రిస్కే. పైగా.. అనుష్కకి ఇప్పుడు ఓ హిట్టు కొట్టడం తప్పనిసరి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని గట్టెక్కించడం అంత తేలికైన విషయం కాదు. దర్శకుడికి ఆ గట్స్ ఉండాలి. కథకి అంత బలం ఉండాలి. యూవీ క్రియేషన్స్ లో సినిమా కాబట్టి.. తప్పకుండా ఆ కథనీ, దర్శకుడ్నీ నమ్మొచ్చు. అనుష్క కూడా అదే నమ్మి ఉంటుంది. త్వరలోనే ఈసినిమా పట్టాలెక్కబోతోంది.