తెలుగులో ఓ మంచి సినిమా వస్తే చాలు.. రీమేక్ రైట్స్ ఎగరేసుకుపోవడానికి బాలీవుడ్ రెక్కలు కట్టుకుని వాలిపోతోంది. యావరేజ్ సినిమానీ వదలడం లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ హిట్టయిన తరవాత… ఆ జోరు మరింత ఎక్కువైంది. `జెర్సీ` బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇప్పుడు వాళ్ల దృష్టి `క్రాక్`పై పడింది. ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిపోయిన సినిమా `క్రాక్`. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి రెడీ అవుతోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు.. ఠాగూర్ మధుని సంప్రదించినట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని మాత్రం `ఈ సినిమాని బాలీవుడ్ లోనూ నేనే తీస్తా` అంటున్నాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్ అక్షయ్ కుమార్‌కి బాగా సరిపోతుంది. ఇక్కడి `విక్రమార్కుడు`ని అక్షయ్ నే రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. ఈసారీ.. `క్రాక్`లో హీరో తనే కావొచ్చు. ఏ భాషలో వచ్చినా.. పోలీస్ కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా మలిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. `క్రాక్` ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. గోపీచంద్ మలినేని షరతుకు.. నిర్మాతలు ఓకే అంటే.. అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చేసే ఛాన్స్ వుంది.