టీఆర్ఎస్కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .. బీజేపీకి పని పెట్టారు. అయోధ్య రామాలయంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రామాలయానికి విరాళాలివ్వాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై విరుచుకుపడ్డారు. అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకు ఎందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాముడి పేరు మీద బిక్షం ఎత్తుకుంటున్నారని.. కొత్త నాటకానికి తెర లేపుతున్నారని ఆయన మండిపడ్డారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా అని ఆయన బీజేపీపై మండిపడ్డారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి స్పందన వస్తే బీజేపీ ఊరుకుంటుందా.. వెంటనే రంగంలోకి దిగింది. రాజాసింగ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వెంటనే క్షమాపణ చెప్పాలని మీడియా ముందుకు వచ్చేశారు. ఆలయాన్ని కట్టేటందుకు ఎంతో మంది ముందుకు వచ్చారని.. కానీ ప్రతీ హిందువును భాగస్వామ్యం చేయాలని నిధి సేకరిస్తున్నామన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలోనే కోరుట్ల, మెట్ పల్లిలో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు.
కొన్ని చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో అయోధ్య ఆలయం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. ఆందోల్ లాంటి చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా విరాళాలిచ్చారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తేనేతుట్టెను కదిలించారు. విరాళాలివ్వొద్దని పిలుపునిచ్చారు. ఇప్పుడు బీజేపీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టే అవకాశం లేదని తాజా పరిణామాలతో తేటతెల్లమవుతోంది.