టీవీ9, సాక్షి ఛానల్ కు గత రెండేళ్లలో వచ్చిన టిఆర్పి రేటింగులు అన్ని బూటకమే నా? రేటింగ్ లను ప్రకటించే బార్క్ సంస్థ తో కుమ్మక్కయి ఫేక్ రేటింగ్ లని ఈ రెండు చానల్స్ ప్రకటించాయా? తాజాగా Acquisory Risk Consulting సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ అనాలిసిస్, బార్క్ సంస్థ టాప్ మేనేజ్మెంట్ ఆయా చానల్స్ తో కుమ్మక్కై చేసిన అరాచకాల బాగోతాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం మీడియా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న నివేదిక వివరాలు ఇవే..
మీడియా వర్గాల్లో సంచలనం రేపుతున్న తాజా నివేదిక:
సినిమా హిట్ అయిందో లేదో ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలు చెబుతాయి. అయితే టీవీ ఛానళ్ల విషయంలో ఏ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ లభించింది ,ఏ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు అని చెప్పడానికి అధికారికమైన ప్రామాణికత అంటూ ఏమీ లేదు. బార్క్ అనే ప్రైవేటు సంస్థ ఇచ్చే రేటింగ్ ల ఆధారంగా కొంతవరకు ఏ చానల్స్ కు ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు. వాణిజ్య ప్రకటనలు ఇచ్చే సంస్థలు కూడా ఈ కారణంగానే బార్క్ రేటింగ్ లని పరిశీలిస్తూ ఉంటాయి. చానల్స్ కూడా బార్క్ లో వచ్చిన రేటింగ్ లని చూపించుకుని, నిర్ణీత సమయం పాటు ప్రకటన ప్రసారం చేయడానికి రుసుము నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే తాజాగా వెలుగు లోకి వస్తున్న వాస్తవాల ప్రకారం బార్క్ అంత ఇచ్చే రేటింగులు అన్నీ నిజంగా ప్రేక్షకాదరణ కు సూచికలు కావు అని, బార్క్ లో పనిచేసే ఉద్యోగులతో పాటు స్వయంగా మేనేజ్మెంట్ ఆయా టీవీ చానల్స్ తో కుమ్మక్కై రేటింగ్ లని పూర్తి స్థాయిలో తారుమారు చేశారని, ఇది కేవలం హిందీ చానల్స్ కు మాత్రమే కాకుండా తెలుగు చానల్స్ కన్నడ చానల్స్ విషయంలో కూడా జరిగిందని ఇప్పుడు బయటకు వస్తున్న వాస్తవాలు మీడియా వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
సంస్థ టాప్ మేనేజ్మెంటే సూత్రధారి:
ప్రత్యేకించి తెలుగు చానల్స్ వరకు వస్తే టీవీ9, సాక్షి ఛానల్ రేటింగు లని వచ్చిన దాని కంటే చాలా ఎక్కువగా బార్క్ రేటింగ్ ప్రకటించిందని, టీవీ5 ఏబీఎన్ ఛానెల్స్ కి వచ్చిన రేటింగ్ కంటే తక్కువ చేసి బార్క్ చూపించిందని తాజా నివేదిక బయట పెట్టింది.
బార్క్ సంస్థ ప్రొడక్ట్ లీడర్షిప్ మాజీ అధినేత వెంకట సుజిత్ సామ్రాట్, ఈ వ్యవహారానికంతటికీ సూత్రధారిగా వ్యవహారించాడని, తనకు రజిని రాథోడ్ కు మధ్య ఏ ఛానల్ రేటింగ్‌ను ఎంతమేరకు తగ్గించాలి, ఏ ఛానల్ రేటింగ్ ఏ మేరకు పెంచాలి అన్న విషయంలో జరిగిన పూర్తి స్థాయి ఈ మెయిల్స్ ని ఏ ఆర్ సిపీ సంస్థ బయటపెట్టింది. ప్రత్యేకించి 2018 , 2019 సంవత్సరాలలో చానల్స్ రేటింగ్ లని తారుమారు చేసే వ్యవహారం చాలా జోరుగా నడిచిందని ఆ ఈమెయిల్స్ ద్వారా తేటతెల్లమైంది.
అగ్రస్థానంలో ఉన్న చానల్స్ కు రేటింగ్ మార్చుకోవాల్సిన అవసరం ఏంటి?
నిజానికి మొదటినుండి అగ్రస్థానంలో కొనసాగిన టీవీ 9 సంస్థకు రేటింగులు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నలు ప్రేక్షకులలో కూడా కలుగుతున్నాయి. అయితే ఇంతలోనే 2018 సంవత్సరం మొదలు టీవీ9 పూర్తిగా రాజకీయ పార్టీల చేతి పనిముట్టు గా మారిపోయిందనే అభిప్రాయం చాలామంది ప్రేక్షకులలో కలుగుతోంది. ప్రత్యేకించి 2018 ప్రారంభంలో మొదలుపెట్టి కత్తి మహేష్, శ్రీ రెడ్డి లాంటి వారిని టీవీ ఛానల్స్‌లో తిష్టవేసి కూర్చోబెట్టి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ గా చేసుకుని ఆ చానల్ తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేసిన సంగతి తెలిసిందే. దాని కారణంగానే అప్పట్లో పవన్ కళ్యాణ్ టీవీ9 ఛానల్ ని బహిష్కరించమని పిలుపు నిచ్చిన సంగతి కూడా తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిలుపు సంగతి పక్కన పెట్టినా కూడా అప్పటికే ప్రేక్షకులలో ప్రజల కోసం కాకుండా రాజకీయ ఉద్దేశాలత జరుగుతున్న ఈ డిబేట్ల పట్ల ఏవగింపు కలిగి చాలామంది టీవీ9 ఛానల్ చూడడం ఆ మధ్యలో పూర్తిగా మానేశారు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా టీవీ9 బార్క్ ప్రకటించే టీఆర్పీ రేటింగులో ప్రధమ స్థాయిలో నిలిచేది. అది ఎలా సాధ్యమైంది అని అప్పట్లో ప్రేక్షకుల కి అర్థం కాకపోయినా, తాజాగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాల ప్రకారం చూస్తే బహుశా ఆ సమయంలో ని రేటింగుల ని తారుమారు చేయడం టీవీ9 మొదలుపెట్టిందేమో అన్న అనుమానాలు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. అప్పటి సీఈఓ రవిప్రకాష్ పాత్ర దీనిలో ఏమైనా ఉండి ఉండవచ్చేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి.
ఏది ఏమైనా, మనకు నీతులు చెప్పే చానల్స్ అదే స్థాయిలో నీతులు పాటిస్తాయి అనుకుంటే అది పొరపాటే అని తాజా నివేదిక మరొకసారి రుజువు చేస్తోంది.
-Zuran