లేడీ యాంకర్లలో సుమ…ఓ సూపర్ స్టార్ అయితే, మగ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు అంతటి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో అత్యంత బిజియెస్ట్ యాంకర్ తనే. ఇప్పుడు హీరోగానూ మారాడు. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్. ఈనెల 29న విడుదల అవుతోంది.
నిజానికి లాక్ డౌన్ కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. థియేటర్ల మూత వల్ల కుదర్లేదు. ఈలోగా.. ఈ సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. ఫ్యాన్సీ రేట్లకు కొనడానికి ఆహా, జీ5 లాంటి సంస్థలు ఉత్సాహం చూపించాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమాపై భరోసా ఉంచి, థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుద అవుతోంది. ఆడియో పరంగా `నీలి నీలి ఆకాశం.. ఇద్దామనుకున్నా` పాట సూపర్‌డూపర్ హిట్టయిపోయింది. ఈ సినిమాపై జనాల ఫోకస్ పెరగడానికి ఆ పాటే కారణం. పైగా ప్రదీప్ హీరోగా ఏం చేస్తాడో, చూడాలనుకుంటోంది చిత్రసీమ. ఈ సినిమా హిట్టయితే.. ప్రదీప్ తో సినిమాలు చేయడానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, మరో రెండు సినిమాల్లో ప్రదీప్ హీరోగా బుక్కయిపోవడం ఖాయం. ఫిమేల్ యాంకర్లలో.. ఎంతమంది ఉన్నా.. అనసూయ మాత్రమే సినిమాల్లో రాణిస్తోంది. మెయిల్ యాంకర్లకు ఆ అవకాశమే లేదు. ఇదివరకు కొంతమంది యాంకర్లు హీరోలుగా అవతారం ఎత్తారు. వాళ్లందరికీ నెగిటీవ్ రిజల్టే వచ్చింది. ప్రదీప్.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా గనుక హిట్టయితే.. ప్రదీప్ జాతకమే పూర్తిగా మారడం ఖాయం.