స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఈమధ్య సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. `లైగర్`, `గని` బాక్సింగ్ తో కూడుకున్న కథలు. ‘లక్ష్య’ మాత్రం ఆర్చరీ చుట్టూ తిరగబోతోంది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సంతోష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ రోజు శౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమా కోసం శౌర్య చాలాకష్టపడ్డాడు. బాడీ పెంచాడు. సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. ఆ కష్టమంతా టీజర్లో కనిపించింది.
”చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు,.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు”
– అనే జగపతి బాబు డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆర్చరీ ఆటకే గుర్తింపు తెచ్చిన పార్థూ.. తన వైభవం కోల్పోవడం, ఆటకు దూరం అవ్వడం, తిరిగి.. బరిలోకి దిగడం.. ఇదంతా టీజర్లోనే చూపించేశారు. శౌర్య పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నాయన్న విషయం టీజర్లోనే అర్థం అవుతోంది.
”పడి లేచినవాడితో పందెం.. ప్రమాదకరం”. మరి.. పడి లేచిన పార్థూ.. ఎలా గెలిచాడు? ఎవరిపై గెలిచాడు? అన్నదే మిగిలిన కథ. టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న నాగశౌర్యకు కచ్చితంగా ఇది కొత్త రకమైన పాత్రే. మరి.. ఈసారి శౌర్య ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?