హైదరాబాద్: రు.251లకే స్మార్ట్ ఫోన్ అంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండురోజులుగా కలకలం సృష్టిస్తోన్న ఫ్రీడమ్ 251 వెబ్సైట్ మూతబడింది. రు.251లకే స్మార్ట్ ఫోన్ అనటంతో, ఇవాళ ఉదయం బుకింగ్ ప్రారంభం కాగానే దేశప్రజలు విపరీతంగా ఎగబడ్డారు. ఒక్కసారిగా అంతమంది ఓపెన్ చేయటంతో వెబ్ సైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఆ వెబ్ సైట్లో బుకింగ్ చేయటానికి వెళితే యాజమాన్యంవారి సందేశం ఒకటి కనబడుతోంది. సెకనుకు 6 లక్షల హిట్లు రావటంతో సర్వర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, అందుకే ప్రస్తుతం విరామం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మళ్ళీ 24 గంటల్లో ఆన్లైన్లో అందుబాటులోకి వస్తామని తెలిపారు.
మరోవైపు ఈ సంస్థ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు వెబ్ సైటే లోడ్ తట్టుకోలేనట్లుగా ఉంటే రు.251లకు ఫోన్ ఎలా తయారు చేయగలుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతులమీదగా ఆవిష్కరణ అని ప్రకటించటం ద్వారా ఇది జెన్యూన్ అనే ముద్రకోసం ప్రయత్నించారుగానీ, పారికర్ నిన్నటి ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇదిలా ఉంటే ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రతినిధులు ఈ ఫోన్‌ను ఒకదానిని దొరకబుచ్చుకుని దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి పరిశీలనలో తేలిందేమిటంటే, దీనిని పూర్తిగా ఐఫోన్ డిజైన్‌లో తయారు చేశారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. వెబ్ సైట్లో పెట్టిన ఫోటోలకు, ఒరిజినల్ ఫోన్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు. ఫోన్ మీద యాడ్‌కామ్ అని రాసి ఉన్నప్పటికీ దానిని వైటనర్‌తో చెరపటానికి ప్రయత్నించారు. ఫోన్లో యూట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్, స్వచ్ఛ భారత్ వంటి అనేక యాప్‌లు ఉంటాయని వెబ్ సైట్లో రాశారు. కానీ ఫోన్లో ఆ యాప్లేమీ లేవు.
ఎంత ఖర్చు పెట్టటంలేదు, రెండొందల యాభైరూపాయలేగా అనే భావంతో లక్షలమంది బుకింగులు చేసుకుంటున్నారు. ఇంత చవకగా ఎలా సాధ్యం అని ఆలోచించటంలేదు. మరోవైపు మొబైల్ ఫోన్ తయారీ సంస్థల యజమానులు ఇది కేవలం పబ్లిసిటీ స్టంటేనంటున్నారు. ఇంత చవకగా స్మార్ట్ ఫోన్ అందించటానికి సాధ్యం కాదని చెప్పారు.