“పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం.”. అంటూ గత ఎన్నికల సమయంలో ఊరూవాడా ఫ్లెక్సీలు వెలశాయి. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఆయనకు ఓటేయకుండా.. చేసిన ప్రచారంలో భాగమని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ కూడా ఇది నిజమని నమ్ముతున్నారు. ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… తనపై అభిమానం ఉన్నా.. జగన్‌కు ఓటేశారని తేల్చేశారు. ఎందుకంటే.. జగన్ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మారట.. ఇప్పుడా నమ్మకాన్ని.. జగన్ కాలరాస్తున్నారని.. ఆయన అంటున్నారు.
నిజంగా పవన్ కల్యాణ్‌పై అభిమానం ఉన్న వారెవరూ జగన్‌కు ఓటు వేయరని.. జనసేనకే వేస్తారని ఆశించారు. అయితే.. పవన్ కల్యాణ్‌కు ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఆయన సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. దీన్ని విశ్లేషించిన పోల్ ఎక్స్పర్ట్స్..పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా.. జగన్‌కే ఓట్లేశారని తేల్చారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌ను జగన్ వ్యక్తిగతంగా తిట్టారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. నిత్య పెళ్లికొడుకని మండిపడ్డారు. అదే సమయంలో జగన్ పై పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాంటి తీవ్రమైన విబేధాలున్న సమయంలో.. పవన్ ను అభిమానించేవారు… జగన్ కు ఓటేస్తారని ఎవరూ అనుకోలేదు.
అయితే… చాలా మంది కాపు యువత.. దళిత వర్గాల్లోని పవన్ ఫ్యాన్స్.. మైనార్టీల్లో పవన్ అంటే… వీరాభిమానం ఉన్న వారు కూడా.. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారని వివిధ రకాలుగా లెక్కలు తీసి తేల్చారు. దీనికి కారణం.. పవన్ కల్యాణ్ బలహీన అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు… సామాజిక వర్గ పరంగా.. అప్పటి అధికార పార్టీపై కులద్వేషం నింపడంతో.. వారిని ఓడించడానికి జగన్‌కు మద్దతిచ్చారంటున్నారు. పవన్‌కు ఓటేస్తే.. అది టీడీపీకి బలం అనిప్రచారం చేయడం… వైసీపీ కూడా… పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అని ప్రచారం చేయడం దీనికి కారణం అన్న అంచనాలున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే నమ్ముతున్నారు.
తిరుపతి ప్రెస్మీట్లో వైసీపీ పాలనపై జగన్ చాలా సింపుల్‌గా తేల్చారు. అదృష్టం అందలమెక్కిస్తే.. బుద్ది బురదలో పొర్లాడేలా చేస్తోందని తేల్చారు. అంత కంటే సూటిగా విమర్శించడానికేమీ ఉండదు. వైసీపీ నేతలు ఆదాయం కోసం పేకాట శిబిరాలు నిర్వహించుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే హిందూత్వంపై దాడిని కూడా ప్రభుత్వ చేతకాని తనానికి సాక్ష్యంగా చూపించారు. మొత్తానికి పవన్ కల్యాణ్.. డైరక్ట్ ఎటాక్ చేయడంలో రోజు రోజుకు మెరుగుపడుతున్నారు. అయితే తిరుపతి ఉపఎన్నిక విషయంలో మాత్రం… జనసైనికులకు క్లారిటీ ఇవ్వలేకపోయారు.