పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎస్ఈసీకి సహకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులకు తేల్చి చెప్పడంతో వారెవరూ.. ఎస్ఈసీతో కనీసం సమావేశానికి కూడా ఆసక్తి చూపడంలేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున.. పంచాయతీరాజ్ కమిషనర్, ముఖ్య కార్యదర్శితో ఎస్ఈసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు సార్లు సమయం మార్చి హాజరు కావాలని ఆదేశించిన వారెవరూ రాలేదు. స్వయంగా మెమో జారీ చేసినా… పరిగణనలోకి తీసుకోలేదు. ఉదయం… పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
ఉదయం పది గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఎన్నికలపై సమావేశం ఉందని వారికి సమాచారం పంపారు. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఉందని వారు చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు వస్తామని సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత.. అసలు సమాధానం ఇవ్వలేదు. సమావేశానికి వెళ్లలేదు. దీంతో ఉద్యోగులు ఎవరూ ఎస్ఈసీకి సహకరిచేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం.. ఎస్ఈసీ ఆదేశాలను ధిక్కరించడానికే సిద్ధమయ్యారు.
రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం ఎస్ఈసీ పరిధిలోకి వస్తుంది. చీఫ్ సెక్రటరీ కూడా ఎస్ఈసీ చెప్పినట్లుగా చేయాలి. డీజీపీ కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ సూచనలు పాటించాల్సి ఉంటుంది. అయితే.. సీఎస్‌తో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేస్తారన్నప్రచారం నేపధ్యంలో.. పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి పరిస్థితి చూసి రావాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి పంపించారు. దీని వల్ల ఆయన అందుబాటులో లేరు. పంచాయతీ రాజ్ అధికారులు హాజరు కావడానికి సుముఖంగా లేరు. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే.. ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోబోమని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే కలెక్టర్లతో ఓ సారి మాట్లాడిన నిమ్మగడ్డ ఎన్నికల కోడ్ విషయంలో దిశానిర్దేశం చేశారు. అయితే వారు కూడా ప్రభుత్వ సూచనల ప్రకారమే నడుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాకపోవడంతో.. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరవై మూడో తేదీన అంటే శనివారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. పది గంటలకు నిమ్మగడ్డ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు… సీనియర్ ఐఏఎస్‌ను నియమించినట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు.