స్వతంత్ర భారతావనిలో భారత ప్రజాస్వామ్యం ఇప్పటి వరకూ ఎదుర్కోనన్ని సవాళ్లను ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య మూలస్తంభం అయిన ఎన్నికలను.. అదే ఎన్నికల ద్వారా ఏర్పాటయిన ప్రభుత్వం సవాల్ చేస్తోంది. ఓ రకంగా ప్రస్తుతం రాజ్యాంగానికి – ఏపీ సర్కార్కు మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుస్తారు..? ఎవరు వెనకబడతారు అన్నదానిపై భారత ప్రజాస్వామ్య తదుపరి నడక ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సీఈసీ అధికారాలన్నీ ఎస్ఈసీకి ఉంటాయన్న హైకోర్టు..!
” రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలన్నీ ఉంటాయి..!” ఇది మూడు రోజుల కిందట… కొత్తగా ఏపీ హైకోర్టుకు వచ్చిన చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి,జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఉన్న కీలకాంశం. అంత స్పష్టత ఉన్నప్పుడు… ఎస్ఈసీ అధికారాలను ధిక్కరించడానికి ఎవరూ సిద్ధపడరు. ముఖ్యంగా అఖిలభారత సర్వీసు అధికారులు. ఎందుకంటే.. ప్రతీ అధికారి ఎన్నికల విధుల్లో పాల్గొని ఉంటారు. వారందరూ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఎవరి ఆదేశాల ప్రకారం పని చేసేవారో వారికి స్పష్టంగా తెలుసు. అయినా ఎస్ఈసీని ధిక్కరించి.. తాము ఆయన చెప్పిన పనే చేయబోమని చెప్పడమే కాదు… నోటిఫికేషన్ ఇచ్చినా సరే తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. లేఖలు రాస్తున్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వక రాజ్యాంగ ఉల్లంఘనే.
ఎస్ఈసీని ఎన్నికలు జరపనివ్వకపోతే ఇక రాజ్యాంగం నిర్వీర్యమే..!
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటే… ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కూలదోస్తున్నట్లే. రేపు కేంద్ర ప్రభుత్వం కూడా .. ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా లేమని… ప్రకటిస్తే.. పరిస్థితేమటి..? అంటే.. ఎన్నికలు లేకుండా.. అలా భారత ప్రజాస్వామ్యం ముందుకెళ్లిపోతుందా..?. రాజ్యాంగ విధి ప్రకారం.. ఎన్నికలు నిర్వహించాల్సిందే. దానికి ప్రభుత్వాలు కూడా అతీతం కాదు. రాజ్యాంగ విధి ప్రకారం.. ఎస్ఈసీ అయినా సీఈసీ అయినా ఎన్నికలు పెడతారు. వాటికి తగ్గ ఏర్పాట్లను యంత్రాగం చేయాలి. ఒక్క సారి నోటిఫికేషన్ వచ్చిన తరవాత మొత్తం వ్యవస్థ … ఎస్ఈసీ.. సీఈసీ ఆదేశాలతో పని చేయాలి. అయితే అది ఎన్నికల నిర్వహణ వరకే. ఈ విషయంలో స్పష్టత ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ధిక్కరిస్తోంది.
రాజ్యాంగాన్ని బలహీనం చేస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల రాజకీయ విధేయత..!
రాజ్యాంగంతో యుద్ధానికి ఏపీ సర్కార్ సిద్దమయింది. బరిలోకి దిగింది. ఉన్నతాధికారుల్ని ముందు పెట్టి యుద్ధం చేస్తోంది. ఎన్నికలకు సహకరించని అధికారులు రిస్క్ చేస్తున్నారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఎవరు ఏం చెప్పినా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని.. కేంద్రం కూడా అండగా ఉంటుందన్న నమ్మకం కల్పించబట్టే అధికారులు ధిక్కరణకు సైతం మొగ్గు చూపారు. ఈ విధేయత రేపు వారికి మరిన్ని పదవులుతెచ్చి పెట్టవచ్చు. కానీ తమ స్వార్థం కోసం ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేస్తున్నారన్న అంశాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు. కాలపరీక్షలో నిలబడుతున్న భారత రాజ్యాంగానికి ఇప్పుడు పెను సవాల్ ఎదురైనట్లే.