పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ శుక్రవారం రాత్రి సమయంలో అలా రాష్ట్ర ఎన్నికల కమిషనరేటర్‌లోకి కారు దిగి వెళ్లి.. అక్కడ పేషిలో ఓ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ లేఖ సారాంశం… ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేనని చెప్పడం. కేంద్ర ఎన్నికల కమిషన్ స్థాయి అధికారాలు ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ సీనియర్ ఐఎఎస్ ఇలా లేఖ రాయడం ఆశ్చర్యకరమే. గోపాలకృష్ణ ద్వివేదీ ఇలా రాయడం ఇంకా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆయన కూడా ఎన్నికల అధికారిగా పని చేశారు. ఆ అధికారాల్ని స్వయంగా ఉపయోగించుకున్నారు కూడా.
గోపాలకృష్ణ ద్వివేదీ .. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్‌లందరిలో కల్లా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు.. కార్యకర్తలు.. సాధారణ ప్రజలు కూడా గుర్తు పెట్టుకుంది. ఆయనకు ఈ గుర్తింపు సీఈవో పదవి వల్ల వచ్చింది. సీఈవో అంటే.. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా గోపాలకృష్ణ ద్వివేదీ ఉన్నారు. అంటే.. ఎన్నికలు మొత్తం ఆయన చేతుల మీద నడిచాయన్నమాట. అప్పట్లో… చంద్రబాబు సర్కార్ ను మూడు నెలల పాటు.. ఎన్నికల కోడ్ కారణంగా అధికారాలేమీ లేకుండా చేసిన వైనం అందరినీ ఆకర్షించింది. చీఫ్ సెక్రటరీని, ఇంటలిజెన్స్ చీఫ్‌ని.. కీలకమైన అధికారులందర్నీ… గోపాలకృష్ణ ద్వివేదీ బదిలీ చేయించారు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మొత్తం పట్టు సాధించారు.
అప్పట్లో చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించి… సీనియర్‌గా నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా… కోడ్‌ను అత్యంత కఠినంగా అమలు చేయించారు. ఎన్నికలకు.. కౌంటింగ్‌కు మధ్య నెలన్నర గ్యాప్ ఉన్న సమయంలోనూ.. అప్పటి సీఎం చంద్రబాబును పని చేయనివ్వలేదు. సీఎస్ ద్వారా సొంత పాలన చేశారు. చివరికి రుణమాఫీ రెండువిడతల నిధులకు బడ్జెట్ కేటాయింపులు.. జీవోలు వచ్చినా నిలిపివేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పాస్ చేయనివ్వలేదంటే ఆయన ఎంత సీఈవోగా ఎంత అపరిమితమైన అధికారం ఆయనకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా తన అధికారాల్ని స్పష్టంగా .. సూటిగా వినియోగించుకున్నందుకు ఆయన బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు కూడా వచ్చింది. లక్ష నగదు బహుమతి కూడా అందుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు అదే గోపాలకృష్ణ ద్వివేదీ… ఎన్నికల కమిషన్‌ను ధిక్కరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా తాను చేయలేనని అంటున్నారు.
హైకోర్టుకు హామీ ఇచ్చి కూడా.. ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేయలేదు. పంచాయతీల్లో ఎన్నికలు పెట్టడానికి ఉద్యోగుల్ని సిద్ధం చేయలేదు. పైగా… ఎస్‌ఈసీ సమావేశాలకు తాము రాలేమని… ఎన్నికలు సాధ్యం కాదని ఎదురు చెబుతున్నారు. నిజానికి ఆయన కూడా ఎన్నికల నిర్వహణకు సుముఖంగానే ఉండి ఉండవచ్చు..కానీ ప్రభుత్వ విధానం ప్రకారం ఆయన ముందుకెళ్లాలి కాబట్టి… అలా వెళ్తున్నారనుకోవాలి. కానీ.. ప్రభుత్వ విధానమైనా.. నిబంధనల ప్రకారమే ఉండాలని చెప్పడమే కదా.. సివిల్ సర్వీస్ ట్రైనింగ్ లక్ష్యం. ప్రస్తుతం ఎన్నికల కమిషనన్‌ను ధిక్కరించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు వచ్చి ఉండవచ్చు. బహుశా.. తాను చేస్తున్నది కరెక్ట్ కాదని ఆయనకు కూడా అనిపించిందేమో.. ట్విట్టర్ లో శుక్రవారం ఫీలింగ్స్ పేరుతో… కొన్ని సార్లు బాధ్యతల్ని పక్కన పెట్టి… మన ఇష్టం వచ్చినట్లుగా గడపాలని ఓ కొటేషన్‌తో చిన్న వీడియో పోస్ట్ చేశారు.