భారతీయ జనతా పార్టీతో గ్యాప్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంగీకరించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణంగా ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. రూ. ఎనిమిదిన్నర లక్షల ఆర్థిక సాయం అందించారు. తర్వాత ఎస్పీని కలిసి అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్… వైసీపీకి గట్టి హెచ్చరికలు పంపించారు. అదే సమయంలో… రాజకీయాలపైనా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీతో గ్యాప్ ఉందని అంగీకరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పార్టీ జాతీయ నేతలు పవన్ కల్యాణ్‌కు గౌరవం ఇస్తున్నారు కానీ.. రాష్ట్ర నేతలు మాత్రం తీసి పడేస్తున్నారు.
పవన్ కల్యాణ్ అంటే బ్లాంక్ చెక్ అని.. తాము వాడేసుకోవచ్చన్నట్లుగా మాట్లాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని తాము పోటీ నుంచి విరమించుకోవడాన్ని మరింత అలుసుగా తీసుకున్నారు. అప్పట్లోనే తెలంగాణ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు… ఏపీ నేతలు చేస్తున్నారు. పూర్తిగా చర్చలు జరపకుండానే… తిరుపతి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని.. పవన్ అంగీకరించారని… జనసేన మద్దతు ఇస్తుందని సోము వీర్రాజు ప్రకటించేశారు. ఆ తర్వాత కూడా వారి దూకుడు తగ్గలేదు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం.. అలాంటి దూకుడు ప్రకటనలు చేయడంలేదు. ఏపీ బీజేపీ నేతల తీరుపై జనసేన నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. అందుకే పవన్ .. బీజేపీతో గ్యాప్ గురించి ప్రస్తావించారు.
తన పని తాను చేసుకుపోతున్నారు. మొదట్లో.. రెండు పార్టీలు కలిసి ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారం.. కలిసి రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు కానీ.. ఆ తర్వాత జనసేనను పక్కన పెట్టి.. బీజేపీ తన పనులు తాను చేసుకుంది. దీంతో పవన్ కూడా తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్యాప్ ఉందని పవన్ అంగీకరించారు. ఆ గ్యాప్ ఫిల్ అవుతుందా.. లేక తిరుపతి ఉపఎన్నికతో మరింత పెరిగి కట్ అవుతుందో వేచి చూడాలి.. !