పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలయింది. విపక్షాలన్నీ ఎన్నికలకు సిద్ధమంటున్నాయి. కానీ వైసీపీ మాత్రం.. ఎన్నికలు వద్దే వద్దని అంటోంది. ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. ప్రభుత్వం అసలు ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనే పెట్టుకోకుండా… ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రభావితం చేసి.. ఎన్నికలకు దూరంగా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పడం కష్టమవుతోంది. చివరికి సుప్రీంకోర్టులోనే ఏదో ఒకటి తేలాల్సి ఉంది. ఇరవై ఐదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. అధికారులు స్వీకరిస్తారో లేదో క్లారిటీ లేదు. సుప్రీంకోర్టులో ఆ రోజున పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకూ సహకరించాల్సిన అధికారులు సహకరించే పరిస్థితి లేదు.
అయితే విపక్ష పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. స్థానిక నేతలు… తమ తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నాయి. నామినేషన్ పేపర్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు… పార్టీల ప్రకారం జరగవు. పార్టీ గుర్తుల ఆధారంగా జరగవు. ఆయా పార్టీల మద్దతుదారులన్నట్లుగానే జరుగుతాయి. అందుకే… నేతలు స్థానికంగా తమ పార్టీ మద్దతుదారులను బరిలో నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరహా ప్రయత్నాలను వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రాదన్న చర్చ బలంగా ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు అందడం లేదు.
దీంతో కొంత మంది స్థానిక నేతలు.. చొరవ తీసుకుని సర్పంచ్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ తేలకపోతే… వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు పూర్తి వ్యతిరేకం కాబట్టి… ఎన్నికలు బహిష్కరిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలా జరిగితే.. స్వీయ శిక్ష విధించుకుంటున్నట్లు అవుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది. మిగతా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లాగే.. దీనిపైనా వైసీపీ నేతలకు క్లారిటీ లేకుండా పోయింది.