” ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు… నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా…!” అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు. తనపై రగిలిపోయి ఏదేదో చేస్తున్న హీరోయిన్ పగ తీర్చడానికి హీరో ఇచ్చిన సలహా అది. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై అదే పగతో ఉన్నట్లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసమస్యలపై పోరాటం చేద్దామనుకున్న ప్రతిపక్ష నేతల్ని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులు డిసైడ్ చేసుకున్నట్లుగా అన్నారు. చివరికి రేప్ కేసులు కూడా పెట్టేస్తున్నారు.
సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై ఏకంగా అత్యాచారయత్నం కేసు పెట్టారు. రిమాండ్ రిపోర్టులోనూ అత్యాచారయత్నం చేయబోయారని రాసి.. న్యాయమూర్తికి సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ చూసి.. న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటిని ముట్టడిస్తే.. రేప్ కేసేమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఐదుగురు టీఎన్ఎస్ఎఫ్ నేతల్ని మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సారి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పోలీసులు తప్పయిపోయిందని.. కేసు పెట్టిన సెక్షన్లు మాత్రం అత్యాచారం కాదని.. చెబుతున్నారు.
మామూలుగా ఇలాంటి ముట్టడి కార్యక్రమాలకు పోలీసులు కేసులు పెట్టరు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో రెండు, మూడు గంటలు ఉంచి పంపేస్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలంటే.. ఏపీ పోలీసులు సందు దొరికితే.. అట్రాసిటీ కేసులు… హత్యాయత్నం కేసులు పెట్టేస్తున్నారు. ఎవరో వాటర్ బాటిళ్లు వేస్తే చంద్రబాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తున్నారు. ఇక్కడ రేప్ కేసులు పెట్టారు. అభాసు పాలయ్యారు. మొత్తానికి ఏపీ పోలీసుల పని తీరు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది.