మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్, షర్టు వేసుకుని వచ్చారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన పొడువాటి గడ్డం, బాగా పెరిగిపోయిన జుట్టుతో కనిపించారు. పూర్తిగా తెల్లగడ్డం. కానీ డ్రెస్సింగ్ మాత్రం ఆఫీసర్ స్టైల్లో ఉంది. ఈ ప్రత్యేకత చూసినా.. ప్రత్యేకంగా పరిశీలన జరిపిన తర్వాత ఆయన ఎల్వీ సుబ్రహ్మణ్యం అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. ఉద్యోగుల తీరుపై మీడియా అభిప్రాయం తెలుసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని… రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని నిర్భయంగా అడిగి… తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సలహా ఇచ్చారు. ఎల్వీ మాటలు మీడియాలోనూ హైలెట్ అయ్యాయి. సాధారణ ఎన్నికల సమయంలో… ఎన్నికల కమిషన్ అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని తొలగించి… ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్‌గా నియమించింది.
ఆయన ఫలితాలు రాక ముందే వైసీపీకి కావాల్సిన సమాచారం ఇచ్చి వారి ప్రాపకం పొంది. .. ఆ తర్వాత కూడా సీఎస్‌గా కొనసాగారన్న విమర్శలు ఉన్నాయి. మధ్యలో గొడవలు వచ్చి.. అవమానకరంగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత విధుల్లో చేరకుండానే.. రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అప్పట్నుంచి ఆయన గడ్డం పెంచుకుటున్నారని బయటపడింది. ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లారా లేక.. ఏదైనా శపథం పెట్టుకున్నారా అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.